నంద్యాల, జనవరి 12: ఆళ్లగడ్డ రూరల్ PS పరిధిలోని అహోబిలంలో ఈనెల 4 న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి, ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్సై నరసింహులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2003 లో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చెడు సావాసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నాడు.
ముందుగా రెక్కీ చేసి, టార్గెట్ చేసిన వారిని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేయాలనేది ఈ ముఠా అసలు కుట్ర. ఆ దురాలోచనతో మొత్తం నాలుగు కిడ్నాప్లకు ప్రయత్నించి అన్నింటా విఫలమయ్యారు. వీరిని ఈ రోజు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన నంద్యాల వరదరాజు రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ముద్దాయి నాగేంద్ర గతంలో మైదుకూరులో కాంట్రాక్ట్ చేసే సమయంలో ఉన్న పరిచయంతో అతనిని కిడ్నాప్ చేసి, దీని ద్వారా రూ.50 లక్షలు డిమాండ్ చేయాలన్న ఆలోచనతో పథకం రూపొంచారు. ఇటీవల అతనిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుపడడంతో పరారయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.