Andhra Politics: హరిహర వీరమల్లు సినిమాపై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు 

చాలా కాలం తరువాత రాబోతున్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు గురించి ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. దీనికి తోడు రాజకీయం సెగలు కక్కుతోంది. మరోవైపు హరిహర వీరమల్లు కోసం నిర్మాత నుంచి తీసుకున్న 11 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ను పవన్ వెనక్కి ఇచ్చేశారు.

Andhra Politics: హరిహర వీరమల్లు సినిమాపై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు 
Hari Hara Veera Mallu Political Row

Updated on: Jun 05, 2025 | 9:19 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కొద్దిరోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్‌పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని.. ఇవి దివాళా రాజకీయాలు కావా అని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చెప్పుచేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని.. ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శించారు.

సినిమా నిర్మాతకు కాసులు కురిపించాలంటూ అంబటి సెటైర్లు

పవన్ కల్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు మరో మాజీమంత్రి అంబటి రాంబాబు. హరిహరవీర మల్లు సినిమా ఐదేళ్లకు పైగా తీశారని.. అది నిర్మాతకు కనకవర్షం కురిపించాలంటూ సెటైర్లు వేశారు.

హరిహర వీరమల్లు చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక వాయిదా..

మరోవైపు హరిహర వీరమల్లు చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక వాయిదాపడింది. ఈ నెల 8న తిరుపతి ఎస్వీయూ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది

సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చేసిన పవన్

ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. 2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా, సుదీర్ఘ కాలం సెట్స్‌పైనే ఉండిపోయింది. పవన్‌కల్యాణ్‌ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..