పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు.. జనసేన బిగ్ అనౌన్స్‌మెంట్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ పేర్కొన్నారు. మన్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలోనే సీట్ల పంపకం ఉండదని, ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు.. జనసేన బిగ్ అనౌన్స్‌మెంట్..
Pawan Kalyan

Updated on: Nov 22, 2026 | 12:33 PM

పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసేన కీలక ప్రకటన చేసింది. ఎక్కడైనా జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి రాజకీయపరమైన అడ్డంకులు ఉండవంటూ స్పష్టం చేశారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఉన్నట్టు.. పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు, సీట్ల పంపకాలు ఉండవని తేల్చిచెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు జనసేన పేరుతో ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కొన్ని స్థానాల్లో సీట్ల పంపకం క్లిష్టతరంగా మారింది. కూటమి పార్టీలకు కూడా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం పెద్ద సవాల్‌గా మారింది. కొన్ని స్థానాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

“గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాం” అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us