విజయవాడలోని (Vijayawada) ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో బ్యారేజీ (Prakasam Barrage) జలకళను సంతరించుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ 25 గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ సీజన్‌లో ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాలువల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పశ్చిమకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 23,117 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు మేత కోసం జీవాలను తోలుకుని నదిలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో రేపు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కోరారు. వర్షాకాలం భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తుగా అప్రమత్తం అయినట్లు ఆయన తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు, జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.