దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టని మహిళలు..

| Edited By: Ravi Kiran

Mar 26, 2024 | 9:03 PM

మా పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుంది, మహిళల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ మాదే అని చెప్పుకోదగ్గ రాజకీయపార్టీలు ఆ నియోజకవర్గంలో లేదు. మరో నియోజకవర్గంలో మహిళకు సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఉత్తరాంధ్రలోని ఆ రెండు కీలక నియోజకవర్గాల నుండి ఇప్పటి వరకు ఒక్క మహిళ..

దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టని మహిళలు..
Ap News
Follow us on

మా పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుంది, మహిళల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ మాదే అని చెప్పుకోదగ్గ రాజకీయపార్టీలు ఆ నియోజకవర్గంలో లేదు. మరో నియోజకవర్గంలో మహిళకు సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఉత్తరాంధ్రలోని ఆ రెండు కీలక నియోజకవర్గాల నుండి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కడ పురుషుల ఓటర్లు కన్నా మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా శాసనసభలోకి అడుగు పెట్టకపోవడం ఆసక్తిగా మారింది. విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలు 1951లో శాసనసభ నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ రెండు నియోజకవర్గాల్లో మొత్తం పదిహేను సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఇప్పటివరకు ఒక మహిళ కూడా ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు.

సాలూరు నుండి 2009లో గుమ్మడి సంధ్యారాణి ఒకసారి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలుకావడంతో అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు. ఇక ఎంతో ఘన చరిత్ర కలిగిన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు ఇక్కడ నుండి ఏ ఒక్క రాజకీయపార్టీ మహిళకు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇండిపెండెంట్‎గా కూడా ఏ ఒక్క మహిళ పోటీ చేయకపోవడం విశేషం. 1951లో సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి కృషికర్ లోక్ పార్టీ నుండి కుమ్మిశెట్టి వెంకటనారాయణ దొర తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లారు. అలా అప్పటినుండి 2019 ఎన్నికల వరకు మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. 15 సార్లు పురుషులే శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

ఎస్టీ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు లక్ష మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ నుండి ఒక్క మహిళ కూడా శాసనసభలోకి అడుగుపెట్టకపోవడం చూసి తమ సమస్యలు చట్టసభల్లో చెప్పుకునే పరిస్థితే లేదని వాపోతున్నారు మహిళా సంఘ నేతలు. మరోవైపు బొబ్బిలిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 1952లో బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడగా ఇక్కడ కూడా 15 సార్లు ఎన్నికలు జరగ్గా 15 సార్లు పురుషులే అసెంబ్లీకి వెళ్లారు. రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు లక్షకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు మహిళలకు పెద్దపెట్టవేసిన బొబ్బిలి సంస్థానం ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళలకు మాత్రం ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదు. చట్ట సభలకు సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చి పంపలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఏది ఏమైనా ఇప్పటివరకు ఈ రెండు నియోజకవర్గాల్లో మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదన్న అంశం జిల్లాలో కొత్త చర్చకు దారితీసింది.