ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించారు సీఎం జగన్. ఇకపై, రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్.
అధికారంలోకి వచ్చిన నాటినుంచి విద్య-వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నో కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నాడు – నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. లేటెస్ట్‌గా ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకూ పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.
ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా… ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే.. రూ. 25 లక్షల వరకూ ఉచితంగా చికిత్స లభించనుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు, రవాణా ఛార్జీల కింద రూ. 300 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో, ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.
వైద్యరంగంలో సంస్కరణలకు 55 నెలల కాలంలో రూ.32,279 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని అడుగులు వేస్తున్నామని.. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్.
విద్య, వైద్యం అనేది ప్రజల హక్కు. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సీఎం జగన్ తెలిపారు. ఆసుపత్రి భవనాలను ఆధునీకరించడమే కాకుండా వైద్యులు, సిబ్బంది సమయపాలన విషయంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని రకాల వైద్యపరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లాంటి వైద్య సిబ్బందిని నియమించి సామాన్యునికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీని రూ. 25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందేందుకు వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు పాలు పంచుకుంటారు.