
మైదుకూరులోని లక్ష్మి మాధవరాయ స్వామికి గండికోటలోని మాధవరాయ స్వామికి ముడిపడిన చరిత్ర ఇది.. 11వ శతాబ్దంలో గండికోటకు కాకరాజు పునాదులేసినట్లు చరిత్రను బట్టి తెలుస్తుంది. 16వ శతాబ్దంలో పెమ్మసాని రామలింగ నాయుడు అందులో మాధవరాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. 1652లో గోల్కొండ నవాబు కుతుబ్ షాహీల సైనికాధికారి మీర్ జుమ్లా గండికోటపై దాడి చేశారు. దాడి సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అప్పటి పాలకులు.. అక్కడి ఆలయంలోని మాధవరాయస్వామిని మైదుకూరు తరలించి పాతూరులోని ఓ బావిలో దాచినట్లు ప్రచారం. దాదాపు 310 ఏళ్ల కిందట బావి నుంచి ఈ విగ్రహాన్ని వెలికితీసి ఇక్కడే ప్రతిష్ఠించారు. నాటి నుంచి మైదుకూరులోనే పూజలందుకుంటున్నారని ప్రతీతి. అయితే ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది అదేమిటంటే.. నవాబుల కాలంలో హిందువుల ఆలయాలపై విధ్వంసం చేసే క్రమంలో ఆలయంలో హింసను ప్రేరేపించడంతో పాటు నానారకాలుగా హింసించి సర్వం దోపిడి చేసి అత్యాచారాలు చేయసాగారని చరిత్రను బట్టి తెలుస్తోంది.
ఆలయ సంపదను దోచుకునేందుకు గర్భగుడిలో ప్రవేశించి ఆలయ ద్వారాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారని చరిత్ర కారులు చెబుతున్న అంశం .. ఈ దారుణాలను శ్రీలక్ష్మీ మాధవరాయ స్వామి చూడలేక గర్భగుడి వెనుక భాగమున రంధ్రం చేసుకుని ఆ రంధ్రం గుండా బయటికి వచ్చి మాండవ్య క్షేత్రమైన మైదుకూరులోని ఒక ‘సెలిమె’ లో వెలిశారట. ఆ సెలిమె ఇపుడు మైదుకూరులోని పాత ఊరులోని పెద్దబావి. ఈ సొరంగమార్గం గండికోట దుర్గం నుంచి మైదుకూరు పెద్దబావి వరకు ఇప్పటికి ఉన్నదని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ రోజుల్లో ఆ సెలిమె ఉన్న పరిసరప్రాంతమంతా అరణ్య ప్రాంతాన్ని తలపించేలా ఉండేదట. ఆసిలిమె అంటే ప్రస్తుతం పెద్దబావి చుట్టూ కంప, నల్లేరు. జిల్లేడు చెట్లతో, పొదలతో నిండి ఉండేదట. అప్పుడు పరిసరప్రాంతాలలో ఒక మేకల కాపరి మేకలు తోలుకొని వచ్చి మేపుకొంటూ ఉండేవాడని, ఆ మేకల మందలో నుంచి ఒక మేక ఆ సెలిమె దగ్గర ఉన్న పచ్చిగడ్డి, ఆకులు మేయడం కోసం బావి వద్దకు వచ్చి దాహం తీర్చుకునేదట. ఆ మేక దాహం తీర్చుకున్నందుకు బదులుగా శ్రీ మాదవరాయ స్వామికి పాలు సమర్పించుకునేదట. తన స్థావరమైన బావి ద్వారా దాహం తీర్చుకున్నందుకు స్వామి వారి ఋణము తీర్చుకునేదట. ఇలా ప్రతి రోజూ జరుగుతుండేదని, ఆ మేక యజమాని ఒకసారి ఆమేకను గుర్తించి ప్రతి రోజు ఆ మేక సెలిమె దగ్గరకు వచ్చే సమయంలో ఆ యజమాని ఆగ్రహంతో దుడ్డు కర్రతో మేకను కొట్టబోయే సమయంలో ఆ కర్ర దెబ్బ మేకకు తగల కుండా స్వామికే తగిలిందట. ఆ దెబ్బతో స్వామి తలకు గాయం అయిందని చెబుతారు.
ఆ గాయం మచ్చ స్వామి వారి నుదిటిపై ఇప్పటికీ కనిపిస్తుంది. కర్రదెబ్బ తగిలిన సందర్భంలో స్వామి వారే స్వయంగా మాట్లాడి.. మూర్ఖుడా నేనెవరిని అనుకుంటున్నావు. గండికోట నుండి వచ్చిన మాధవరాయ స్వామిని అన్నట్లుగా కొన్ని మాటలు వినపడినాయట.. ఈ విషయం ఊరంతా వ్యాపించి ఊరి పెద్దలు, ప్రజలు అంతా కలిసి స్వామి వారిని గుర్తించి స్వామిని బయటికి తీసి అప్పటికప్పుడు ఆలయం నిర్మించి స్వామి వారిని ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తున్నారు.
ముఖ్యంగా ధనుర్మాసంలో స్వామి వారికి పెద్దబావి నీళ్ళతో అభిషేకం చేయించి భక్తులు కూడా ఈ బావి నీటితో స్నానం చేసి శ్రీ మాధవరాయస్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటూ ఉండేవారట. అప్పుడు మైదుకూరు లోని ప్రజలకు కోరుకున్న కోర్కెలు తీరుస్తూ సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తూ శ్రీ లక్ష్మి మాధవరాయస్వామి భక్తులను కాపాడుతున్నారట. అప్పట్లో స్వామివారి అనుగ్రహంతో పుట్టిన పిల్లలకు స్వామి వారి పేరు పెట్టుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ భక్తులు స్వామి వారి పేర్లతో మైదుకూరులో ఉన్నారు. గండికోట ఆలయంలో గర్భగుడి రంధ్రం వద్ద తూటు వేసుకొని స్వామి తొలగిపోయె అనే శాసనం అక్కడ ఇప్పటికీ కనిపిస్తుందట. ఆలయం నిర్మించిన సంక్రాంతిని పురస్కరించుకొని ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.. కనుమ రోజు జరిగే పార్వెట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.. కళాకారుల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణ,డప్పు మేళతాలాల నడుమ స్వామి వారిని 16పల్లెల్లో రోజుకో గ్రామంలో ఊరేగిస్తారు.. అలా స్వామి వారు ఆ ఊర్లలోకి ఉరేగింపుగా వచ్చిన రోజు అంబరాన్ని అంటేలా సంక్రాంతి సంబారాలు చేసుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..