తన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ‘భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు మాటలు రావట్లేదు. మేం చెప్పిన అంశాలను సీబీఐ లెక్కలోకి తీసుకోవడం లేదు. కీలకమైన అంశాల్ని సీబీఐ పక్కనబెడుతోంది. వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడున్నాడు. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. షేక్ అహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందు చెప్పిందే నేను. హత్య విషయం నాకన్నా గంటముందే వివేకా అల్లుడికి తెలుసు. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. ధైర్యం కోల్పోం.. నిజాయితీ నిరూపించుకుంటాం. కట్టుకథలతో జరిగే దర్యాప్తు నిలబడదు.’ అని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..