Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీ, తెలంగాణలో ఇవాళ వానలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నాయి. ఇక మరికొన్ని చోట్ల ఎండ తీవ్రత కొనసాగనుంది.

Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్
Rains In Telangana And Andhra Pradesh

Updated on: Apr 09, 2026 | 7:03 AM

ఏపీలో వాతావరణం మారుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రరూపం దాల్చుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో భానుడి ప్రతాపంప కొనసాగుతోండగా.. మరికొన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నేడు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని, అలాగే పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

అక్కడ మాత్రం ఎండలు

తెలంగాణ, రాయలసీమ మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు.  ఇక రాయలసీమలో మాత్రం ఎండ తీవ్రత కొనసాగనుందని చెప్పారు. దీంతో వృద్దులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వర్షాల విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 44 మిమీ అధిక వర్షపాతం నమోదైంది. ఇక పోలవరంలో 37.7 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక సమ్మర్‌లో పడుతున్న ఈ అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటకు తీవ్ర నష్టం చేకూరుతోంది. ఇక వర్షాలతో పాటు ఈదురుగాలులతో పంటకు నష్టం జరుగుతోంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి, నువ్వులు, రాగులు వంటి పంటలు ధ్వంసమయ్యాయి.

తెలంగాణలో వర్షాలు

ఇక తెలంగాణలో బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. ఇక ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించారు. అటు రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, రెండు నుంచి మూడు డిగ్రీల మేర టెంపరేచర్లు పెరుగుతాయని పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. భానుడి తీవ్రత, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కాస్త వర్షాలు కురుస్తుండటంతో ఉపశమనం పొందుతున్నారు. దీంతో ప్రజలకు చల్లని కబురు అందింది. అయితే రానున్న రోజుల్లో ఎండ ప్రభావం మరింత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

Follow Us