కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని తిరిగి తల్లిదండ్రులకు వద్దకు చేర్చింది సోషల్ మీడియా. అనంతపురం రూరల్ సమీపంలోని కొడిమి క్రాస్ సెంటర్‌లో నివసిస్తున్నారు సురేష్‌బాబు కుటుంబం. సురేష్‌బాబు ఆటో డ్రైవర్..అతని కుమారుడు రెండున్నరేళ్ల తేజేశ్వర్ ఈ నెల 11న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. ఉన్నట్టుండి బాబు కనిపించకుండా పోవడంతో సురేష్‌బాబు, స్థానికులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. 10 ప్రత్యేక బృందాలతో ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ముమ్మర గాలింపు చేపట్టారు. బళ్ళారి రోడ్డులోని అన్ని గ్రామాలను గాలించారు. డ్రోన్ కెమెరాలు తెప్పించి బాలుడి ‘ఇంటి
చుట్టు పక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు జల్లెడ పట్టారు. 15 మంది ప్రత్యేక దళాలతో ఇంటి చుట్టు ప్రక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు అన్ని దిక్కులలోని వాగులు, వంకలు, ముళ్ళ పొదలు, రాళ్ళ గుట్ట ల లోను వెతికించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. watsapp, facebook లద్వారా అన్ని గ్రూపులలో పంపించి బాగా వైరల్ చేశారు. దీంతో బాలుడి ఆచూకీ ఫోన్ సమాచారం ద్వారా పోలీసులకు అందింది.
అసలేం జరిగింది…
కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కాంట్రాక్ట్ పనులు చేసుకునే వాడు. తన వ్యక్తిగత పని మీద ఈ నెల 11న కళ్యాణదుర్గం నుండి కూడేరు మీదుగా అనంతపురము వెళ్తుండగా కొడిమి వద్ద రాత్రి సుమారు 8.20 గంటల సమయంలో బాలుడు ఏడుస్తూ కనిపించాడట. కాసేపు అక్కడ ఆగిచూస్తే..చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడిని తన స్కూటీపై ఎక్కించుకుని అనంతపురంలోని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. మరసటి రోజు ఉదయము తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. తనకు పెళ్లై తొమ్మిదేళ్లు అయినప్పటికీ.. పిల్లలు లేకపోవడంతో ఆ పిల్లవాడిని పెంచుకుందామని అనుకున్నారు. తరువాత వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా బాలుడి ఫోటో ప్రచారం కావడంతో ఆ చిన్నారి తనవద్దే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించాడు. నవంబర్ 16న బాలుడిని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీర రాఘవ రెడ్డి వివరించారు. సోషల్ మీడియా ద్వారా నేటితరం యువత చెడు బారిన పడుతున్నారని ఆవేదనగా ఉన్నా,.. కొన్ని అంశాల్లో వాటిని సరిగా వినియోగిస్తే ఎంత మంచి జరుగుతుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచిందన్నారు.