Fish Market: మీరు తాజా మాంసం కొనుగోలు చేసేందుకు మార్కెట్ కు వెళ్తున్నారా…? మాంసం వ్యాపారి ఇచ్చే మాంసాన్ని కనీసం గమనిస్తున్నారా..? మీరు కొనుగోలు చేసే మాంసం తాజాగా ఉందో లేదో.. అది నిల్వఉంచిన మాంసమో అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా…? ఇలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని అనుకుంటున్నారా..? అందుకు కారణం.. మార్కెట్ లో అక్రమ వ్యాపారులు చేసే కల్తీ మాంసం విక్రయాలే.. ఇటీవల కాలంలో కల్తీ మాంసం విక్రయాలు వినియోగదారులు మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి.. కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసాన్ని సైతం తాజా మాంసంతో కలిసి విక్రయిస్తున్నారనే నిజం.. కస్టమర్లను ఉలిక్కిపడేలా చేస్తుంది.. ఇంతకూ ఈ తరహాలో కల్తీ మాంసం విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం..
ఏపీలో కల్తీ మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి.. మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు.. గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి.. రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు.. అయితే.. మాంసానికి తనిఖీ ముద్ర వేసే అధికారుల కళ్లుగప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు.. ఇలా చాలా కాలంగా జరుగుతున్నదని పలువురు ఫిర్యాదు చేసినా… అధికారులు తనిఖీలు చేస్తున్నా.. ఈ దందా మాత్రం ఆగడం లేదు..
విజయవాడ నగరంలో కుళ్లిన మాంసం విక్రయాల బాగోతం మరోసారి వెలుగు చూసింది. కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్లో కుళ్లిపోయిన 100 కేజీల మాంసాన్ని నిల్వ ఉంచడాన్ని కార్పొరేషన్ వెటర్నరీ అధికారులు గుర్తించారు. గత నెలలో రాణిగారితోటలో 100 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. ఈ మాంసాన్ని గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తుంటే అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ రైల్వేస్టేషన్‌లో వందల కేజీల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు తనిఖీ అధికారులు..
విజయవాడ నగరంలో రోజూ వేల కేజీల మాంసం విక్రయాలు సాగుతాయి. మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి మరుసటి రోజు తాజా మాంసంతో కలిపి విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం అందడం కొత్తేమీ కాదు. ఇలా ఐదు రోజులు గడిచాక.. శని, ఆదివారాలకు వచ్చేసరికి గ్రామాల్లో లేదా సంతలో జబ్బు పడిన, చనిపోయిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మాంసంగా మార్చి ధ్రువీకరించిన మాంసంతో పాటు కలిపి అమ్మేస్తూ.. విక్రయదారులు కాసులు పోగేసుకుంటున్నారు. మిగిలిపోయిన మాంసాన్ని తమ ఇళ్లల్లో భారీ సైజ్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసుకుని వాటిలో నిల్వ ఉంచుతున్నారు మాంసం వ్యాపారులు..
ఒక్కోసారి మూడు నాలుగు రోజులు నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇది తెలియక కస్టమర్లు తాజా మాంసమని కొనుగోలు చేసి జబ్బుల బారిన పడుతుంటారు. వెటర్నరీ అధికారులు గొర్రెలు, మేకలు, దున్నలను పరీక్షించాక వాటిని మాంసం విక్రయదారులు కోయాలి.. ఆ మాంసానికి తనిఖీ ముద్ర వేశాక మార్కెట్లో విక్రయించాలి. అయితే.. అధికారుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి..
కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్ లో విక్రయదారులు కుళ్లిన మాంసాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారనే సమాచారంతో మునిసిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎ.రవిచంద్ తన సిబ్బందితో కలిసి చేపలమార్కెట్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన మాంసాన్ని, తాజా మాంసంతో కలిపి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.. కల్తీ మాంసాన్ని, పొట్టేలు తలకాయలు కల్తీవో కాదో.. గుర్తించడం అంత కష్టమేమి కాదని డాక్టర్ రవిచంద్ చెబుతున్నారు.. మీరు మాంసం కొనుగోలు చేసే ముందు ఫ్రెష్ గా ఉన్న మాంసాన్నే కొనుగోలు చేయాలని.. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే..
కల్తీని గుర్తించడానికి సలహా ఇచ్చారు.. ఫ్రెష్ మాంసం పింక్ కలర్ లో ఉంటుందని.. నిల్వ ఉంచిన చెడిపోయిన మాంసం థిక్ రెడ్ కలర్ లో ఉంటుందని చెప్పారు.. మరోవైపు.. నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అనంతరం ఆ మాంసాన్ని ల్యాబ్ కు తరలించి.. పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే రిపోర్ట్ ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటున్నారు… ఖచ్చితంగా వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాజా మాంసం విక్రయాలు జరపాలని.. అక్రమంగా ఎవరైనా కల్తీ చేసి విక్రయాలు చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు..
Reporter: Sivakumar TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..