Andhra: కాసిన్ని నీళ్లు ఇవ్వమని ఇంట్లోకి వచ్చాడు.. ఆమె ఒంటరిగా లోపలికి వెళ్లేసరికి..

సమయం పది కావొస్తోంది. షాప్ ఇంకా మూసి ఉంది. ఎవరూ తెరవలేదు. షాప్‌నకు వచ్చిన కస్టమర్లు ఒక్కొక్కరిగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఈలోగా ఓ వ్యక్తీ షాప్ యజమానికి ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేరా.? షాప్ తెరవలేదు ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత.!

Andhra: కాసిన్ని నీళ్లు ఇవ్వమని ఇంట్లోకి వచ్చాడు.. ఆమె ఒంటరిగా లోపలికి వెళ్లేసరికి..
Vinukonda

Edited By: Ravi Kiran

Updated on: Aug 22, 2025 | 12:51 PM

బంగారం కోసం ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. పట్టపగలే హత్యలకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలనే ఇందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినుకొండలో జరిగిన హత్య కలకలం రేపింది. చిల్లర కొట్టు నడుపుకునే మహిళను ఉదయం పూటే హత్య చేసి నిందితులు ఆధారాలు దొరక్కుండా పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ కల్యాణపురి కాలనీలో ఆలపాటి పుష్పలత చిల్లర కొట్టు నిర్వహిస్తుంటుంది. ఆమె భర్త రవీంద్ర పట్టణంలోనే మరొక దుకాణంలో పనిచేస్తుంటాడు. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటలకే రవీంద్ర షాప్‌నకు వెళతాడు. అప్పటి నుంచి పుష్పలత ఒక్కతే ఇంట్లో ఉంటూ దుకాణం చూసుకుంటుంది. అయితే నిన్న పది గంటల తర్వాత కూడా ఇంటి తలుపులు మూసి ఉండటంతో షాప్‌నకు వచ్చిన వినియోగదారులు వెనుతిరిగి వెళ్లారు. ఇది గమనించి చుట్టుపక్కల వాళ్లు రవీంద్రకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరా అని ప్రశ్నించారు. అయితే తన భార్య పుష్పలత ఇంట్లోనే ఉందన్న విషయాన్ని రవీంద్ర వారికి చెప్పాడు. అయితే తలుపు మూసి ఉండటంతో షాప్‌నకు వచ్చిన వాళ్లు వెనుతిరిగి వెళుతున్నట్లు చెప్పారు. అనుమానం వచ్చిన రవీంద్ర వెంటనే ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా పుష్పలత నిర్జీవంగా పడి ఉంది. ఆమె గొంతు చుట్టూ చీరతో చుట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని వినుకొండ టౌన్ పోలీసులకు చెప్పాడు.

టౌన్ సీఐ శోభన్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే మహిళ హత్య జరిగిందని తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మహిళను హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు బంగారు ఆభరణాల కోసమే చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఇలాగే చనిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే నిందితులు కోసం పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతవరకూ హంతకుల ఆనవాళ్లు గాని.. వారికి సంబంధించిన సమచారం గాని లభ్యం కాలేదు. పుష్పలత భర్త రవీంద్రను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని సాంకేతిక ఆధారాలతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.