Mangli: మంగ్లీది ఏపీలో ఏ ప్రాంతమో తెలుసా..? కింద నుంచి ఎదిగి.. వివాదాల్లో చిక్కి..

తాండలో పుట్టి జానపద గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన మంగ్లీ.. తనదైన గాత్రంతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌ సింగర్‌గా ఎదిగారు. అయితే కెరీర్‌లో ఎన్నో విజయాలతో పాటు పలు వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. మంగ్లీ విద్యాభ్యాసం, సంగీత శిక్షణ, సినీ ప్రయాణం, ఎదురైన వివాదాల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Mangli: మంగ్లీది ఏపీలో ఏ ప్రాంతమో తెలుసా..? కింద నుంచి ఎదిగి.. వివాదాల్లో చిక్కి..
Mangli

Updated on: Aug 12, 2026 | 4:09 PM

పల్లె పాట వినిపిస్తే చాలు.. ఆ గాత్రం మంగ్లీదే అని గుర్తుపట్టే స్థాయికి చేరుకున్నారు సత్యవతి రాథోడ్. తెలుగు రాష్ట్రాల్లో ‘మంగ్లీ’గా పాపులర్ అయిన ఆమె.. జానపద సంగీతానికి తనదైన శైలిని జోడించి ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. అలానే చాలాసార్లు వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. అసలు మంగ్లీ బ్యాగ్రౌండ్ ఏంటి.. ఆమె ఇంతటి స్థాయికి ఎలా చేరుకున్నారు? ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం…

మంగ్లీ ప్రయాణం ఎలాంటి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మొదలుకాలేదు. బంజార కుటుంబానికి చెందిన ఆమె అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బచ్చినేపల్లి తాండలో జన్మించారు. చిన్నతనంలోనే పాటలపై ఆసక్తి పెంచుకున్నప్పటికీ.. ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకునే మార్గం అంత సులభంగా కనిపించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా ఆమెకు సవాలుగా నిలిచాయి.

తాండలో ఐదో తరగతి వరకు చదివిన మంగ్లీ.. ఆ తర్వాత బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను కొనసాగించారు. చదువుతున్న సమయంలోనే ఆమె సంగీత ప్రతిభను కొందరు గుర్తించారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అందించిన సహాయం ఆమె జీవితంలో కీలకంగా మారింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మంగ్లీ.. తిరుపతికి వెళ్లి సంగీతంలో శిక్షణ పొందారు.

కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సంగీతం, నృత్య విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు. తిరుపతిలోని సంగీత విద్యాలయంలోనూ శిక్షణ తీసుకున్నారు. అంటే మంగ్లీ గాత్రానికి వచ్చిన గుర్తింపు ఒక్కరోజులో వచ్చినది కాదు. వేదికపై కనిపించడానికి ముందే ఆమె ఎన్నో సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు, సాధన చేశారు.

అయితే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది టెలివిజన్. ‘తీన్మార్’ జానపద కార్యక్రమంతో మంగ్లీకి విస్తృతమైన గుర్తింపు వచ్చింది. అప్పటివరకు ప్రాంతీయ స్థాయిలో వినిపించిన ఆమె గాత్రం.. టీవీ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరింది. తెలంగాణ యాస, పల్లె పదాలు, ఉత్సాహభరితమైన గానం.. ఇవన్నీ కలిపి మంగ్లీని ఇతర గాయనిలకు భిన్నంగా నిలబెట్టాయి.

టీవీ తర్వాత సినిమాలు, ప్రత్యేక గీతాలు, పండుగ పాటలు ఆమె కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాయి. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి వంటి సందర్భాలకు ఆమె పాడిన పాటలు ప్రత్యేకంగా ఆదరణ పొందాయి. ముఖ్యంగా జానపద శైలిని ఆధునిక సంగీతంతో కలిపి పాడటం మంగ్లీకి బలమైన గుర్తింపుగా మారింది. ఆమె పాటలు డిజిటల్ వేదికల్లో భారీగా ప్రేక్షకులను సంపాదించడంతో.. సాధారణ గాయని నుంచి సెలబ్రిటీగా ఎదిగారు.

మంగ్లీ విజయానికి మరో కారణం ఆమె గాత్రంలో కనిపించే సహజమైన ఉత్సాహం. పల్లె పాట పాడినా, భక్తి గీతం ఆలపించినా, పండుగ పాటలో సందడి చేసినా.. పాటకు తగ్గ భావాన్ని తన గొంతులో పలికించగలగడం ఆమె ప్రత్యేకతగా మారింది. అందుకే గ్రామీణ ప్రేక్షకులతో పాటు పట్టణ యువతలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అలా ఓ చిన్న తాండ నుంచి మొదలైన ప్రయాణం.. తెలుగు సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు, పరిమిత అవకాశాలను దాటుకుని తన ప్రతిభతో ఎదిగిన మంగ్లీ కథ చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది.

అయితే ఇప్పుడు ఆమె కెరీర్‌లో వివాదాలు కొత్త కాదు. ఏడాది క్రితం ఆమె పుట్టిన రోజు వేడుకలు కూడా వివాదానికి దారి తీశాయ. చేవెళ్ల సమీపంలోని త్రిపుర రిసార్ట్‌లో అనుమతి లేకుండా అర్ధరాత్రి పూట డీజే మద్యం పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తనకు డ్రగ్స్‌తో ఎటువంటి సంబంధం లేదని, కేవలం కుటుంబం సభ్యులు, మిత్రులతో జరుపుకున్న వేడుక అని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.

అలాగే మంగ్లీ పాడిన సర్కే చునార్‌ తేరి సర్కే పాట వివాదాస్పదం కావడంతో ఆ పాటను ఆమె తొలగించాల్సి వచ్చింది. సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే దీనిపై అనుకోకుండా జరిగిన పొరపాటు అంటూ ఆమె క్షమాపణలు కూడా చెప్పారు.

మంగ్లీ ఫేమ్‌ను వాడుకుని ఆమె తమ్ముడు శివ, మధు అనే మరో వ్యక్తి కలిసి దాదాపు 100 మందిని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ వ్యవహారంలో అసలు పరిణామాలు ఏమిటన్నది పక్కన పెడితే.. మంగ్లీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.

తాండలో మొదలైన ఓ అమ్మాయి గాత్ర ప్రయాణం.. టెలివిజన్‌ నుంచి సినిమా వరకు సాగి స్టార్ సింగర్‌గా నిలిపింది. అయితే కొన్ని వివాదాలు కూడా మంగ్లీ కెరీర్ లో ఎదుర్కొవలసి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us