మంగళగిరిలో వైసీపీ ఎవర్ని బరిలో నిలిపినా సహకరిస్తా.. మళ్లీ వైసీపీ విజయానికి కృషి చేస్తా.. 2024ఎన్నికల్లో బీసీ వ్యక్తి చేతిలో టీడీపీ ఓటమి ఖాయం.. అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళగిరి రాజకీయాలు.. పలు విషయాలపై చర్చించారు. అనంతరం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఆర్కే ప్రశంసలు కురిపించారు. మరో 20, 30ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలంటూ ఆర్కే ఆకాక్షించారు. జగన్ ఉంటే పేదవాళ్ల జీవితాలు అద్భుతంగా మారతాయన్నారు. వై నాట్ 175, క్లీన్‌స్వీప్ 25 సుసాధ్యం కావాలంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. అనుకోకుండా 2నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని.. రాష్ట్రంలో పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల పట్టు అంటూ విమర్శలు కురిపించారు. విపక్షాల ప్రయత్నాలు ఫలించకూడదనే వైసీపీలోకి వచ్చానంటూ ఆర్కే వివరించారు.
కాగా.. పార్టీలో చేరిన అనంతరం ఆర్కేకు మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతను అప్పగించారు జగన్. అలాగే పొన్నూరులోనూ అభ్యర్థి ఎంపిక, గెలుపు బాధ్యత ఆర్కేకే ఇచ్చారు..! గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆర్కే కీలక పాత్ర పోషించాలని కోరారు. ఆర్కే చేరికతో మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో వైసీపీ , మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధితోనే తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.
ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియమించింది.
ఈ క్రమంలోనే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో హైదరాబాద్‌లో అయోధ్యరామిరెడ్డి చర్చలు జరిపారు. ఆర్కే పట్ల జగన్ సానుకూలంగానే ఉన్నారని చెప్పగా.. పార్టీపైన, అధినేతపైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదంటూ ఆర్కే క్లారిటీ ఇచ్చారు. అనంతరం తిరిగి వైసీపీలో చేరుతున్నట్టు ఆర్కే ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..