
గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదుట అతి పెద్ద వేప చెట్టు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ చెట్టును చూస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున రైల్వే స్టేషన్ కు వెలుతున్న ఒక కుటుంబంపై వేప చెట్టు ఒక్కసారిగా విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని అక్కడికక్కడే చనిపోగా కొడుక్కి, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.
గుంటూరు నగరంపాలెంలో జీవించే సాయి క్రిష్ణ ప్రసాద్, కొలగాని సరిత దంపతులకు ఎనిమిదేళ్ల కొడుకు కార్తీక్ ఉన్నాడు. మంగళగిరిలో సిడిపిఓగా పనిచేసే సరిత ప్రతిరోజూ మంగళగిరి వెళ్లి వస్తుంది. గుంటూరు నగరంలో వరుసగా రెండు రోజుల నుండి రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుంది. గురువారం భారీ వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగారు. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో కూడా వర్షం పడి ఆగిపోయింది. దీంతో సరితను రైల్వే స్టేషన్ లో దించేందుకు సాయి క్రిష్ణ ప్రసాద్, బైక్ పై కొడుకుతో కలిసి బయలు దేరాడు. ఇంటి దగ్గర నుండి ఐదు నిమిషాల్లో సాయి ప్రసాద్ స్టేషన్ కు చేరతాడు. ఎప్పటిలాగే భార్య,భర్త, కొడుకు ఇంటి నుండి బయలు దేరగా సరిగ్గా మెడికల్ కాలేజ్ దాటే సమయంలో పెద్ద శబ్దంతో చెట్టు విరిగి పడింది. విరిగిన కొమ్మపై బైక్ పై వెలుతున్న సాయి క్రిష్ణ ప్రసాద్ కుటుంబంపై పడింది. చెట్టు కొమ్మ తగిలి సాయి క్రిష్ణ ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు కార్తీక్ కాలు విరగ్గా…. సరితకు స్వల్ప గాయాలయ్యాయి.
వీడియో ఇక్కడ చూడండి..
చుట్టు పక్కల వాళ్లు స్పందించి సమీపంలోనే ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సాయి క్రిష్ణ ప్రసాద్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కార్తీక్, సరితకు చికిత్స అందించారు. మ్రుత్యు పాశంలా మారిన చెట్టుకు గురించి తలుచుకొని సరిత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎందరికో నీడనిచ్చిన చెట్టు తన భర్త ప్రాణాలు తీసిందంటూ ఏడుస్తున్న సరితను ఓదార్చటం బంధువుల తరం కాలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..