Mahatma Gandhi – East Godavari: తూర్పుగోదావరి జిల్లాతో మహాత్మాగాంధీజీకి విడదీయలేని బంధం ఉంది. బాపు పాదముద్రలు జిల్లా అంతటా కనిపిస్తూ ఉంటాయి. అహింసే ఆయుధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన బాపూజీ తూర్పుగోదావరి జిల్లా నేలపై కూడా అడుగులు వేశారు. కిలోమీటర్ల దూరం నడిచి స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. 1921, 1929, 1933, 1946లో జిల్లాలో పర్యటించి ఇక్కడి నేలను పునీతం చేశారు మహాత్మ.
రాజమండ్రి టూ సీతానగరం ఆయన గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి. అఖిల భారత కాంగ్రెస్ సమావేశంతో పాటు.. జిల్లాలో అనేక ప్రసంగాల్లో గాంధీజీ పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా.. రాజమండ్రిలో సనాతన కుటుంబాలకు చెందిన 15 మందికి పైగా మహిళలు స్వాత్రంత్య్ర యోద్యమంలో పాల్గొన్నారు. వారంతా జైలు శిక్ష అనుభవించారని చరిత్ర చెప్తోంది. స్వరాజ్య నిధి సేకరణకు రాజమండ్రికి వచ్చిన గాంధీజీ.. 1921లో అప్పటి పాల్ చౌక్.. అంటే ఇప్పటి కోటిపల్లి బస్ స్టాండ్ సమీపంలో ప్రసంగించారు.
1929లో సీతానగరం గాంధీజీ కస్తూర్బా ఆశ్రమం తిలకించి ఎంతో మందికి స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు గాంధీజీ. ఆయన ఆనవాళ్ళు ఇంకా ఆ ఆశ్రమంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో రాజమండ్రి మున్సిపాలిటీ సిబ్బంది కూడా గాంధీజీకి సన్మానాలు చేశారని చెప్తున్నారు చరిత్రకారులు. ఆ గురుతులను ఇప్పటికీ స్మరించుకుంటున్నారు తూర్పు గోదావరి జిల్లా చరిత్ర కారులు.
Read also: Kurnool: నిర్లక్ష్యం నీడలో.. నిద్ర మత్తులో.. క్రీడా ప్రాధికార సంస్థ.. క్రీడాకారులకు నరకం