ఓటుకు నోటు ఇచ్చా.. ఓటు వేయలేదా? డబ్బులు వెనక్కి ఇవ్వండి! ఓడిన అభ్యర్థి వింత డిమాండ్

చిత్తూరు జిల్లా పలమనేరులో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు పంచడం ఒక ఎత్తయితే.. ఓడిపోయాక ఆ డబ్బులు తిరిగి అడగడం మరో ఎత్తు! పలమనేరు మున్సిపాలిటీలోని 32వ వార్డులో ఇప్పుడు ఇదే తరహా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన అభ్యర్థి పూల చైతన్య చేతిలో ఓటమిపాలైన వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓటుకు నోటు ఇచ్చా.. ఓటు వేయలేదా? డబ్బులు వెనక్కి ఇవ్వండి! ఓడిన అభ్యర్థి వింత డిమాండ్
Viral Warning To Voters

Updated on: Nov 04, 2026 | 7:44 PM

చిత్తూరు జిల్లా పలమనేరులో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు పంచడం ఒక ఎత్తయితే.. ఓడిపోయాక ఆ డబ్బులు తిరిగి అడగడం మరో ఎత్తు! పలమనేరు మున్సిపాలిటీలోని 32వ వార్డులో ఇప్పుడు ఇదే తరహా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన అభ్యర్థి పూల చైతన్య చేతిలో ఓటమిపాలైన వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తనకు ఓటు వేస్తారనే నమ్మకంతో వార్డులోని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశానని, కానీ డబ్బులు తీసుకున్న కొందరు తనకు ఓటు వేయలేదని ప్రసాద్‌రెడ్డి ఆరోపిస్తున్న వీడియో చర్చనీయాంశమైంది. రూ.10 వడ్డీకి అప్పు చేసి మరీ సుమారు రూ.10 లక్షలు ఓటర్లకు పంచానని, తనకు ఓటు వేయని వారు ఆ డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తూ.. వీడియో విడుదల చేశాడు. అంతేకాదు.. వార్డులోని మారెమ్మ గుడి వద్దకు వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వచ్చి బైఠాయిస్తానని హెచ్చరించాడు.

దీంతో పలమనేరు 32వ వార్డులో కొత్త చర్చ మొదలైంది. ఓటు వేస్తేనే డబ్బులు సొంతమా? ఓటు వేయకపోతే రీఫండ్ చేయాలా? ఎన్నికల సమయంలో ఇచ్చిన నగదుకు ఇప్పుడు రిటర్న్ పాలసీ కూడా వచ్చిందా? అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరు అయితే ఓటమి తర్వాత అభ్యర్థి ప్రారంభించిన ఈ ‘రికవరీ డ్రైవ్’పై సెటైర్లు వేస్తున్నారు.

నిజానికి ఓటు అనేది ఓటరు వ్యక్తిగత హక్కు. ఎవరికి ఓటు వేయాలనేది ఓటరు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. డబ్బులు తీసుకున్నా తనకు ఓటు వేయలేదంటూ ఓటర్లను బెదిరించడం, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

మరోవైపు, ఈ వీడియో నేపథ్యంలో 32వ వార్డులోని కొందరు ఓటర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసు, ఎన్నికల అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. వీడియోలోని వ్యాఖ్యలపై ప్రసాద్‌రెడ్డి వివరణ, ఆరోపణలపై అధికారిక విచారణ వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఎన్నికల ముందు ఓటు కోసం పెట్టుబడి.. ఎన్నికల తర్వాత ఓటమితో రికవరీ! మరి ఓటరు తీర్పుకు కూడా రిటర్న్ పాలసీ ఉంటుందా? అన్న ప్రశ్న ఇప్పుడు పలమనేరులో హాట్‌టాపిక్‌గా మారింది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us