AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేపాక్షి ఆలయంలో ఆ ఒక్క స్తంభం మాత్రమే గాలిలో తేలడం వెనక మిస్టరీ ఇదే..!

లేపాక్షి వీరభద్ర ఆలయం దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ శిల్ప సౌందర్య నిలయం. ఇక్కడి భారీ ఏకశిలా నంది, అబ్బురపరిచే కుడ్య చిత్రాలు, ప్రత్యేకించి వేలాడే స్తంభం సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ స్తంభం వెనుక గల వాస్తవాలు, ఆలయ నిర్మాణం, పేరు వెనుక ఉన్న విభిన్న కథలు ఈ ప్రాంత విశిష్టతను చాటుతాయి.

లేపాక్షి ఆలయంలో ఆ ఒక్క స్తంభం మాత్రమే గాలిలో తేలడం వెనక మిస్టరీ ఇదే..!
Lepakshi Hanging Pillar
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2026 | 4:21 PM

Share

లేపాక్షి ఆలయంలో శిల్ప సౌందర్యం ఉట్టి పడుతుంది. అక్కడి చిత్రకళా నైపుణ్యానికి ఎవరైనా అబ్బరుపడాల్సిందే.  ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. దాదాపు 500 ఏళ్ల పై చిలుకు చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ అనేక పౌరాణిక, చారిత్రక గాథలు అల్లుకుని ఉన్నాయి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపుర్‌లో ఉంది. లేపాక్షి అనగానే అందరి దృష్టి టెంపుల్ బయట ఉన్న భారీ ఏకశిలా నందిపైకి వెళ్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా ప్రసిద్ధి చెందిన ఇది, ఒకే రాయిని తొలిచి నిర్మించారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవుతో కూడిన ఈ నంది శిల్పంలో సూక్ష్మ వివరాలకు సైతం ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నందిని ఎవరు చెక్కారు, ఎంత కాలం పట్టిందనే వివరాలు అందుబాటులో లేవు. ఆలయంలో ఏడు పడగల నాగు కింద ఉన్న శివలింగం మరో ప్రధాన ఆకర్షణ. గుడి లోపల పైకప్పుపై కనిపించే ఆకర్షనీయమైన చిత్రాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. దాదాపు 500 ఏళ్లుగా ఉన్న ఈ వర్ణ చిత్రాల్లో వీరభద్ర వర్ణచిత్రం 13 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో అత్యంత పెద్దదిగా ప్రాముఖ్యత పొందింది. ఈ చిత్రాల్లో మహాభారత, రామాయణ ఇతివృత్తాలతో పాటు సమకాలీన జనజీవన విధానం, వస్త్రధారణ, కేశాలంకరణ, రాజపురుషులు, కోశాధికారులు, భటుల వంటి అనేక విషయాలను తెలుసుకోవచ్చు.

లేపాక్షిలో వేలాడే స్తంభం ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉంటుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇది వాస్తవంగా వేలాడే స్తంభం కాదు. కాలక్రమేణా స్తంభం కింద భూమి కుంగిపోవడం వల్ల ఇది పాక్షికంగా గాలిలో ఉన్నట్లు కనిపిస్తుంది.  బ్రిటిష్ వారు పరిశోధన కోసం దీనిని కదిలించినప్పుడు స్తంభం పాక్షికంగా ఒరిగినట్లు స్థానికులు చెబుతారు. ఈ స్తంభం మిగతా అన్ని స్తంభాల్లాగే పైకప్పు, దూలాల బరువును మోస్తున్నప్పటికీ, దాని కింద నేలపరుపు బండ ఒకవైపు కుంగినందువల్ల ఒక చివర మాత్రమే నేలను తాకుతుంది. అందుకే చాలా మంది సందర్శకులు స్తంభం కింద బట్టను ఒక వైపు నుంచి ఇంకోవైపుకు లాగి చూస్తారు. ఈ ఆలయ సముదాయంలో మూడు ప్రాకారాలు, మూడు ప్రధాన ఆలయాలు, మూడు ఉప ఆలయాలు, ఒక అర్థమండపం, నాట్యమండపం ఉన్నాయి. వీరభద్రునితో పాటు విష్ణు, శివ, దుర్గాదేవిల గుళ్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడి శిల్పాలు విజయనగర శిల్పకళకు పరాకాష్ఠగా నిలుస్తాయి. శృంగి, భృంగి, విశ్వకర్మ, కల్యాణ సుందరమూర్తి, వీరభద్రుడు, అలాగే మరెక్కడా లేని ఊర్వశి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.

ఆలయం ఉన్న కొండను కూర్మశైలం అంటారు. స్కంద పురాణంలో శివుని 108 క్షేత్రాలలో ఒకటిగా లేపాక్ష్య పాపనాశహ పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణ చరిత్ర విషయానికి వస్తే, పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు. అయితే చరిత్ర ప్రకారం, 16వ శతాబ్దంలో విజయనగర పాలకుడు అచ్యుతరాయులు పరిపాలించే సమయంలో ఆయన కోశాధికారి విరూపణ్ణ ఈ గుడిని కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి. విరూపణ్ణతో పాటు ఆయన సోదరుడు వీరన్న కూడా ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. కానీ వీటికి శాసనాధారాలు లేవు.

లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై అనేక కథనాలున్నాయి. రాముడు జటాయువు పక్షిని ‘లే పక్షి’ అని పిలిచాడు కాబట్టి ఈ ఊరు లేపాక్షి అయిందని ఒక కథనం. అచ్యుతరాయులు విరూపణ్ణ కళ్ళు పీకించారని, లేదా విరూపణ్ణ తన కళ్ళు పీక్కుని ఆలయ గోడకు విసిరి కొట్టడం వల్ల ‘లేపము+అక్షి’ (కళ్ళు లేకుండా) నుంచి లేపాక్షి వచ్చిందని మరొక కథనం ఉంది. తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపణ్ణ మొక్కుకుని, కొండపై మాటలు రాగానే ఆలయం కట్టించాడని ఇంకో కథనం. అయితే, చరిత్రకారుల ప్రకారం గుడి కట్టకముందు నుంచే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉంది. ఆలయ గోడపై ఇనుము రంగు చారలు విరూపణ్ణ కళ్ళ నుండి కారుతున్న రక్తమని భక్తులు నమ్ముతారు, దీనిపై శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు.

Also Read: అడవి కోడితో ఆషామాషీ కాదు.. దాని ప్రత్యేకతలు మీకు తెలుసా..? 

Follow Us