
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు చనిపోవడం ఏపీలో కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో ఆ ఇద్దరు విద్యార్థినులు చనిపోగా.. మరో 120 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. అస్వస్థతకు గురైన వాళ్లను విశాఖ కేజీహెచ్ సహా పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే విశాఖ KGHకు వెళ్లి.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సంధ్యారాణి. అలాగే ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణికి ఫోన్ చేయడంతో.. పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని.. ఆ వర్షాల కారణంగానే జ్వరాలొచ్చాయన్నారు మంత్రి సంధ్యారాణి. అలాగే దసరా సెలవులకి విద్యార్థులు ఇంటికి వెళ్లిరావడంతో.. అక్కడున్న నీటి సమస్యల వల్ల ఈ పరిస్థితొచ్చిందన్నారు.
మరోవైపు అనంతపురంలోని శిశుగృహంలో ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిబ్బంది శిశువు మృతదేహాన్ని పూడ్చేయడం వివాదాస్పదమైంది. అయితే నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు కలెక్టర్. అయితే చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయని.. అందుకే చనిపోయినట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి.
మొత్తంగా.. రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స విద్యార్థులను వైసీపీ నేతలు కూడా పరామర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..