కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన జోరు వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో రహదారులపై నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కౌతాళం, నందవరం, కోసిగి, కోడుమూరు, పెద్దకడుబూరు, బండి ఆత్మకూరు, సున్నిపెంట, సి బెళగల్, ఆస్పరి, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల మండలాల్లో వర్షం కురుస్తోంది. కోడుమూరు మండలంలోని వర్కూరు వద్ద తుమ్మలవాగు, పెంచికలపాడు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తుమ్మలవాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ ను స్థానికులు కాపాడారు.
ఇక, కోడుమూరు పట్టణంలోకి కూడా వరద భారీగా వచ్చి చేరింది. భారీ వరద కారంణంగా కర్నూలు–ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలి వాగు ఉప్పొంగడంలో అక్కడి పొలాలను వరద ముంచెత్తింది.
కోడుమూరు మండలం పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా కర్నూలు-ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాయలం రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది.
కాగా, నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.