ఉయ్యాలవాడ, జూలై 28: బనగానపల్లె నియోజకవర్గంలో ఈ నెల ఏడవ తేదీన కుందూనదిలో చేపలు వేల సంఖ్యలో మృతి చెంది గుట్టులు గుట్టలుగా ఒడ్డుకు కొట్టుకురావడం కలకలం రేపింది. చేపల మృతిపై టీవీ9లో ప్రసారం అయిన కథనాలకు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని స్పందించి అప్పటికప్పుడు పలు శాఖల ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. కమిటిలో కాలుష్య నియంత్రణ పర్యావరణ ఇంజనీర్, నంద్యాల మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, డోన్ ఆర్డిఓ, బనగానపల్లి ఎస్ఆర్బిసి ఈఈ, కేసి కెనాల్ ఈఈలు ఉన్నారు. వీరిందరూ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకుని, నీటి నమూనాలను సేకరించి.. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు.
పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలు కుందూ నదిలో అధిక మోతాదులో కలవడం వల్ల కోవెలకుంట్ల, భీమునిపాడు, క్రిష్టిపాడు గ్రామాలలో చేపలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడినట్లు కమిటీ తేల్చింది. నంద్యాల కుందూనది బ్రిడ్జి భాగంలో చనిపోయిన చేపలు పైకి తేలి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి బనగానపల్లె కుందూనదిలో తేలినట్లు నిర్ధారించారు.
నంద్యాల శివారులో ఉన్న ఎస్.పి.వై. ఆగ్రో ఇండస్ట్రీస్, నందిగ్రైన్స్ డెరివేటివ్స్, నంది మిల్క్ డైరీ పరిశ్రమల వ్యర్థాలు, నంద్యాల పట్టణ మురుగు నీరు కుందూనదిలో కలవడం వలనే చేపలు మృతి చెందినట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో కమిటి నివేదికల అధారంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని కంపెనీలపై తుది చర్యల నిమిత్తం కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలికి నివేదికలు పంపారు. కుందూ నుంచి మండలంలోని 15 గ్రామాలకు పశువులకు, నిత్యవసరాలకు వాటర్ సప్లై అవుతోంది. దీంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..