‘లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌’ ఓ చిన్నారి ఆవేదన

చదువుకోవాలన్న ఆరాటం ఆ పాపది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం ఆ కుటుంబానిది. లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించండి, నేను బాగా చదువుకుంటా అంటూ ఓ చిన్నారి సాగిస్తున్న ఆవేదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది..

లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌ ఓ చిన్నారి ఆవేదన
Kurnool Girl Seeks Hostel Seat

Edited By:

Updated on: Jun 09, 2026 | 8:04 PM

కర్నూల్, జూన్‌ 9: తల్లిదండ్రులు పొట్టకూటి కోసం వలస వెళ్తుంటే.. తన చదువు ఆగిపోకూడదంటూ ఆ పసిపాప చేస్తున్న అభ్యర్థన ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఈ హృదయవిదారక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నేరేడుప్పుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వీరేష్, భాగ్యమ్మల కుమార్తె మానస. ఐదో తరగతి పూర్తి చేసుకుని, ఆరో తరగతిలో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్ళూరుతోంది. స్థానికంగా ఉన్న కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) పాఠశాలలో సీటు వస్తే తన చదువు సాఫీగా సాగుతుందని ఆ చిన్నారి ఆశ. దరఖాస్తు కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ పాపకు సీటు రాలేదు. ఇక్కడే ఆ కుటుంబం ముందు అసలు సమస్య వచ్చి పడింది.

గ్రామంలో ఉపాధి లేక తల్లిదండ్రులు పొట్ట చేతబట్టుకుని వలస పనులకు వెళ్లాల్సిన దుస్థితి. తల్లిదండ్రులతో పాటు వెళ్తే చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇక్కడ ఉందామంటే చూసుకోవడానికి ఎవరూ లేరు. తన భవిష్యత్తు కోసం ఆ చిన్నారి గుండె తరుక్కుపోయేలా విజ్ఞప్తి చేస్తోంది.

 

ఇవి కూడా చదవండి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి… ‘లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించండి.. నేను బాగా చదువుకుంటా, నా చదువు ఆపకండి’ అంటూ అమాయకంగా చేతులు జోడించి వేడుకుంటోంది. ఒకవైపు బడిబాట కార్యక్రమాలు, చదువుల పండుగలు అంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు చదువుకోవాలన్న తపన ఉన్నా కేవలం ఒక హాస్టల్ సీటు దక్కక ఓ పేద విద్యార్థిని చదువు ఆగిపోయే దయనీయ స్థితికి చేరుకుంది. మరి ఈ చిన్నారి ఆవేదన విద్యాశాఖ మంత్రి దాకా చేరుతుందా? మానసకు హాస్టల్ సీటు దక్కి, ఆమె డాక్టర్ కావాలనే కల సాకారమవుతుందా ? వేచి చూడాలి..!

Follow Us