మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సందర్భంగా తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి పలు అంశాల్ని, సీబీఐ విచారణ తీరును ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో ఇదే కేసులో సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ అవినాష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డిని తదుపరి విచారణలో సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 4 సార్లు అవినాష్‌ను ప్రశ్నించింది సీబీఐ. దీంతో తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరారు. అది ఫలించకపోవడంతో ఈసారి ముందస్తు బెయిల్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
హైకోర్టు తీర్పు తర్వాత CBI ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే CBI విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. తనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని భావిస్తోందన్నది ఆయన వాదన.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం