
పార్వతీపురం మన్యం జిల్లాలోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒరిస్సా ప్రభుత్వం మరోసారి కవ్వింపుకు దిగుతుంది. కొటియా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రా అధికారులను ఒరిస్సా పోలీసులు బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. దీంతో కొటియా గ్రామాల వివాదం మరోసారి ఆంధ్ర. ఒడిశా రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 21 గ్రామాలతో కూడిన కొటియా గ్రామాలు రెండు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా మారాయి. 1950 నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. సర్వే జరిగిన సమయంలో ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో ఉన్న ఈ 21 గ్రామాలను అటు ఒడిశా కానీ, ఇటు ఆంధ్రా కానీ క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో ఈ గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి రాకుండా ఉండిపోయాయి. అలా అప్పటి నుంచి ఈ గ్రామాలు మావంటే మావంటూ ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య వివాదం నడస్తోంది. అయితే ఈ గ్రామాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా క్లెయిమ్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలు 1968లో సుప్రింకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రింకోర్టు దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని… అప్పటి వరకు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని స్టేటస్ కో ఇచ్చింది.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలు తమ అభివృద్ధి పథకాలతో మాత్రం ముందుకు వెళ్తున్నాయి. అలా ఈ గ్రామాల్లో రెండు రాష్ట్రాలు తమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఇక్కడ వారు రెండు రాష్ట్రాల బెనిఫిట్స్ పొందుతుంటారు. ఇక్కడ గిరిజనులు రెండు రాష్ట్రాల నుంచి డబుల్ ఐడెంటిటీ కార్డులు కలిగి ఉంటారు. రెండు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలు పొందుతుంటారు. అలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో ఇటీవల రెండు రాష్ట్రాల మద్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా మరింత ఆధిపత్యపోరుకు తెర లేపుతుంది. ఈ గ్రామాల్లోకి ఏపీ అధికారులు వెళ్తే ఒరిస్సా అధికారులు అడ్డుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వ పథకాల సర్వే కోసం కొటియా గ్రామాల్లోకి వెళ్లిన ఆంధ్ర అధికారులను ఒరిస్సా పోలీసులు, అధికారులు అడ్డుకుని వెనక్కి పంపించారు. రైతుల సమాచారం సేకరణ కోసం వచ్చిన ఈ టీమ్‌ను మా ప్రాంతంలోకి రావద్దు అంటూ హెచ్చరించారు. ఇది ఒక్కటే కాదు గత వారం కూడా ఆంధ్రప్రదేశ్ తోనాం వైద్య సిబ్బందిని అడ్డుకుని వెనక్కి పంపారు ఒరిస్సా అధికారులు. గ్రామాల్లో వైద్య సేవలు అందించాలని వచ్చిన డాక్టర్లు, నర్సులను ఇక్కడికి రావద్దు, మా అనుమతి లేకుండా ఏమీ చేయకూడదు అంటూ బెదిరించారు. క్రింది స్థాయి అధికారులు ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొటియా గ్రామాల్లో విధులు నిర్వహించాలంటే భయం భయంగా ఉంటుందని, ప్రతిసారీ ఒరిస్సా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. కొటియా ప్రాంతంలో ఆంధ్ర అధికారులు అడుగుపెడితే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఈ కవ్వింపు చర్యలతో ఇక్కడ రైతులు రైతులు, గిరిజనుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యవసాయ సర్వేలు, వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొటియా గ్రామాల గిరిజనులు ఈ వివాదానికి బలవుతున్నారు. దీంతో వారు మా సమస్యలు పరిష్కరించాలంటే కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుని మేము నష్టపోతున్నామని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య ఏదీ సరిగా రావట్లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఘటనల్లో ఒరిస్సా అధికారులు ఆంధ్ర టీమ్‌లను రెండుసార్లు అడ్డుకోవడం మరింగా ఉద్రిక్తతలను కారణమైంది. ఈ వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చర్చలు జరపాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు ఒడిశాలో, ఇటు ఆంధ్రాలో బిజెపి ప్రభుత్వం ఉన్న నేపద్యంలో ఇప్పుడైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానిక గిరిజనులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి