
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రకాష్ అనే రైతు తన ఇంట్లో కోళ్లు పెంచుతున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం కోళ్లను పట్టుకొని గంప కింద వేశాడు.. ఆ తరువాత కొద్దిసేపటికి కోళ్ల గూడులోకి ఒక పెద్ద కోడెనాగు పాము ప్రవేశించి రెండు కోళ్లను కాటేసింది. అంతటితో ఆగకుండా కోళ్లు పెట్టిన మూడు కోడిగుడ్లను కూడా మింగేసింది. ఎప్పటిలాగే ఉదయం కోళ్లను గంప నుంచి బయటకు వదలడానికి వెళ్లి గంప తీసేసరికి గూడులో ఉన్న తన కోళ్లు చనిపోయి కనిపించాయి. ఈ ఘటన చూసిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కోళ్ల మృతికి ఏమై ఉంటుందని పరిశీలించగా పాము కాటేసినట్లు గమనించారు. అయితే కోళ్లను కాటేసిన పాము ఇంకా తన ఇంటి పరిసరాల్లోనే ఉంటుందని గుర్తించిన రైతు ప్రకాష్ వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న పెంటకోట సూరిబాబు అనే స్నేక్ క్యాచర్ ను కూడా పిలిచాడు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు.
అయితే నాగుపాము స్నేక్ క్యాచర్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టింది. ఇల్లంతా కలియ తిరుగుతూ అందరినీ హడలెత్తించింది. కొంతసేపటి తరువాత ఎట్టకేలకు చాకచక్యంగా నాగుపామును పట్టుకొని ఎవరికి ఎలాంటి హాని జరగకుండా పామును కొండ ప్రాంతంలోని అడవుల్లో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఒకింత భయాందోళన పరిస్థితి నెలకొంది.
అయితే ఇటీవల కాలంలో గ్రామానికి తరుచూ పాములు వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాములు సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తమకు తెలియజేయాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. పర్యావరణ సమతుల్యత కోసం పాములను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పై ఉందని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..