ఇటీవల గిరినాగులు చెలరేగిపోతున్నాయి. ఎక్కడో అడవుల్లో , కొండల్లో ఉండాల్సిన ఈ కోబ్రాలు జనావాసాల్లోకి, పంటపొలాల్లోకి చొరబడి జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కింగ్ కోబ్రా ప్రత్యక్షమవుతూనే ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలోని పంటచేలో తన ఎరను వేటాడుతూ స్థానికుల కంటపడింది. నేలపై జరజరా పాకుతూ సుమారు 10 అడుగుల పొడవైన నల్ల చారల నాగుపామును చూసి జనం బెంబేలెత్తిపోయారు.
శృంగవరపుకోట మండలం భర్తాపురం సమీపంలోని ఓ గ్రామంలో పంటపొలంలో సంచరిస్తూ భారీ గిరి నాగు తన ఎరను వెతుక్కుంటోంది. దాని ఆకలిని గుర్తించినట్లు ఇంతలో ఏదో ఒక ప్రాణి దానికి చిక్కింది. ఆ ఎరను మింగుతూ ఉన్న కింగ్ కోబ్రాను అదే సమయంలో అక్కడ ఉన్న జనాలు చూసి భయపడ్డారు. అంతేకాదు కింగ్ కోబ్రాను బెదిరించడానికి జనం పెద్ద పెద్ద శబ్ధాలు చేశారు. తమ శక్తి కొలది ఆ పామును బెదిరించారు. దీంతో ఎరను తీసుకొని పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రమాదం తప్పినా ఆ గిరినాగు ఏక్షణంలో మళ్లీ ఇటువైపు వస్తుందోమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..