
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. చిన్నారి జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గణేష్, భవాని దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జాహ్నవి అదృశ్యమవడం, అదే సమయంలో వారి పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారి బాధను కొంతైనా తగ్గించి, మనసును తేలికపరిచేందుకు బంధువులు ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. ఓ చిన్న కుక్కపిల్లను తెచ్చి పెంచుకోవాలని సూచించారు.
దీంతో జాహ్నవి తల్లిదండ్రులు కూడా బంధువుల సూచన మేరకు ఒక కొత్త కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ కొత్త నేస్తంతో గడుపుతూ కాసేపైనా బాధను మర్చిపోయే ప్రయత్నంలో భాగంగా, ఆ కుక్కపిల్లకు తమ చిన్నారి పేరు మీదుగా ‘జానూ’ అని నామకరణం చేసుకున్నారు. ఈ చిన్న ప్రయత్నం వారి బాధల బరువును పూర్తిగా తగ్గించలేకపోయినా, తల్లిదండ్రుల మనసుకు కాస్తయినా ఊరటనిస్తుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.
చిన్నారి జ్ఞాపకాల మధ్య ఆ బుజ్జి కుక్కపిల్లను గణేష్, భవాని దంపతులు ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. మరోవైపు తమ చిన్నారి ఎప్పటికైనా తిరిగి వస్తుందని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తుండగా, పోలీసులు జాహ్నవి ఆచూకీ కనుగొనేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
అసలు ఏం జరిగింది?
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో నివసిస్తున్న గణేష్, భవాని దంపతులు కుమార్తె అయిన మూడేళ్ల జాహ్నవి.. గత జులై నెలలో ఇంటి బయట ఆడుకుంటూ తప్పిపోయింది. ఉదయం తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ బయటకు వెళ్లి జాహ్నవి సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. రెండ్రోజులైనా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం 200 మంది పోలీసు సిబ్బంది రంగలోకి దించి.. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్వ్కాడ్ సహాయంతో గాలింపు చేపట్టారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయిందా. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ లభించలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.