Andhra Pradesh: ఆశ్చర్యం..! కుడివైపు గుండె.. ఎక్స్‌రే చూడగా అవాక్కయిన డాక్టర్లు..

|

May 30, 2023 | 9:39 AM

సాధారణంగా అందరికీ గుండె ఛాతి భాగానికి ఎడమ వైపు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తాళ్ళరేవుకు చెందిన శ్రీనివాస్‌కు కుడివైపున గుండె ఉంది.

Andhra Pradesh: ఆశ్చర్యం..! కుడివైపు గుండె.. ఎక్స్‌రే చూడగా అవాక్కయిన డాక్టర్లు..
X Ray
Follow us on

సాధారణంగా అందరికీ గుండె ఛాతి భాగానికి ఎడమ వైపు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తాళ్ళరేవుకు చెందిన శ్రీనివాస్‌కు కుడివైపున గుండె ఉంది. గుండె ఎడమవైపు కాకుండా కుడివైపు ఉండటంతో అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా వైరల్ అయింది. సదరు వ్యక్తి శ్రీనివాస్ గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడ నగరంలోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా.. అక్కడి డాక్టర్లు శ్రీనివాస్‌కు ఎక్స్‌రే తీసి.. గుండె ఎడమవైపు ఉండాల్సిన బదులు కుడివైపు ఉందని గుర్తించి అవాక్కయ్యారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు రెండు చోట్ల బ్లాక్‌లు ఏర్పడటంతో వైద్యులు అతడికి అరుదైన హార్ట్ సర్జరీ నిర్వహించారు. రెండు చోట్ల రక్తనాళాల బ్లాకులను చేతి నుంచి క్లియర్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా రెండు స్టంట్స్ వేసి ఆపరేషన్‌ సక్సెస్ చేశారు డాక్టర్లు. ఈ అరుదైన సమస్య ప్రతీ 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని వైద్యులు వివరించారు. కాగా, గుండెకు శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే శ్రీనివాస్‌ను పూర్తి ఆరోగ్యవంతుడిగా ఇంటికి పంపించడం గమనార్హం.

డెక్స్‌ట్రోకార్డియా..

గుండె ఎడమవైపు కాకుండా కుడివైపు ఉండటాన్ని వైద్యపరిభాషలో డెక్స్‌ట్రోకార్డియా అని అంటారు. దీన్ని గుండె వైకల్యం అని కూడా పిలుస్తారు. ఇలా గుండె కుడివైపు ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఏ ఇతర అవయవాలకు పెద్ద ప్రభావం ఉండదు. కొంతమేరకు మాత్రమే మార్పులు ఉండొచ్చునని డాక్టర్లు అంటున్నారు. శిశువు అభివృద్ధి ప్రారంభంలో లేదా గర్భధారణ సమయంలో ఇలా జరగవచ్చునని డాక్టర్లు చెప్పారు.