
ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. కడప-రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే ఎన్హెచ్ 716కి అనుసంధానంగా దీనిని నిర్మిస్తున్నారు. నాలుగు లైన్ల రహదారిగా దీనిని నిర్మించనుండగా.. దాదాపు 122 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.2254 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేయగా.. వాహనాల గరిష్ట వేగం 100గా నిర్ణయించారు. 2021లోనే కేంద్రం ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయగా.. 2025 అక్టోబర్లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత పనుల్లో కాస్త జాప్యం జరగ్గా.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం కడప జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం కడప నుంచి రేణిగుంట వెళ్లాలంటే 4 గంటల పాటు సమయం పడుతుంది. గతుకులు, గుంతల రోడ్ల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే కేవలం 2 గంటల్లోనే కడప నుంచి రేణిగుంటకు చేరుకోవచ్చు. దీని వల్ల తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు కూడా మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే తిరుపతికి వేగంగా చేరుకునే అవకాశం లభించనుంది. కడప నుంచి ఈ హైవే ద్వారా రేణిగుంట వరకు చేరుకుని, అక్కడ నుంచి తిరుపతికి సులువుగా రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. 2027 చివరికల్లా పనులను పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యం నిర్దేశించుకుంది. 2021లో ప్రాజెక్టుకు ఆమోదం లభించగా.. 2024 వరకు పనులు ప్రారంభం కాలేదు. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో 2025 అక్టోబర్లో పనులు స్టార్ట్ అయ్యాయి. భూసేకరణ, అటవీశాఖ అనుమతులు, పరిహారం వంటి పనులు పూర్తయ్యాయి.
ప్రస్తుతం కడప జిల్లాల్లో ఈ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రైల్వే కోడూరు నుంచి రేణిగుంట మార్గంలో చెట్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. రెండేళ్లల్లోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై-కడప మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైల్వేకోడూరు-రేణిగుంట మధ్య ఉన్న 50 కిలోమీటర్ల రోడ్డు దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఈ రోడ్డు ప్రస్తుతం దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ప్రమాదకర మలుపుల వల్ల రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కొత్త హైవే పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.