Anandaiah: ఆనందయ్య.. ఇదేందయ్య.. నెలల వ్యవధిలో మారిన సీన్.. వివాదాలే తప్ప కనిపించని నాటి క్రేజ్..

మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కరోనా పేషెంట్లతో..

Anandaiah: ఆనందయ్య.. ఇదేందయ్య.. నెలల వ్యవధిలో మారిన సీన్.. వివాదాలే తప్ప కనిపించని నాటి క్రేజ్..
Krishnapatnam Anandaiah

Updated on: Dec 29, 2021 | 5:36 PM

ఆనందయ్య మరోసారి తెరమీదకు వచ్చారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ టైమ్ లో మందు పంపిణీ చేసి వివాదాస్పదమైన ఆనందయ్య, ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మందు పంపిణీ చేస్తానని చెప్పడంతో మరోసారి వివాదం రాజేశారు. అటు తమ గ్రామంలో మందు పంపిణీ వద్దని కృష్ణపట్నం వాసులు డిమాండ్‌ చేస్తుండగా, అటు ఒమిక్రాన్‌ను మందు పంపిణీ చేసేందుకు అనుమతి లేదని ఆయూష్‌ చెబుతోంది. అయితే ఆనందయ్య మాత్రం తన మందు అన్ని రోగాలకు పనిచేస్తుందని చెబుతున్నారు. ఒమిక్రాన్‌కు మాత్రమే పనిచేస్తుందని చెప్పలేదన్నారు. దీంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు మళ్లీ మార్మోగుతోంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కరోనా పేషెంట్లతో తమకు కూడా కరోనా సోకుతందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ చేయొద్దని పంచాయితీలో తీర్మానం చేశారు. అంతేకాదు రెండు రోజుల క్రితం ఆనందయ్య ఇంటి దగ్గర ధర్నాకు దిగారు.

మరోవైపు ఆనందయ్య మందుపై ఆంక్షలు విధించారు జాయింట్‌ కలెక్టర్‌. అనుమతులు లేకుండా పంపిణీ చేస్తే చర్యలు తప్పవంటూ నోటీసులిచ్చారు. ఒమిక్రాన్‌కు మందు అంటూ ఆనందయ్య చేసిన ప్రకటనపై వివరణ కోరారు జేసీ. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులున్నాయో తెలపాలని..అనుమతులు లేకుంటే చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. వారంలోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇక గ్రామ పంచాయతీ ఆనందయ్య మందు పంపిణీ జరపరాదని ఏకంగా తీర్మానం చేశారు.. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.. హేతువాద సంఘాలు అభ్యంతరాలు, అధికారుల వార్నింగ్ లు ఆనందయ్య ఇదేందయ్యా.. 7 నెలల క్రితం చూసిన ఆనందయ్య కళ్ళలో ఉన్న గర్వం, ఆనందం ఇప్పుడు లేవెంటయ్యా అంటూ జనం జాలి చూపుతున్నారు..

అయితే తాజాగా మందు వివాదంపై స్పందించారు ఆనందయ్య. తన మందుకి అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని మాత్రమే చెప్పానన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన నోటీసుపై త్వరలోనే వివరణ ఇస్తానని తెలిపారు.

మొన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌కు తన మందు పనిచేస్తుందని చెప్పిన ఆనందయ్య మళ్లీ మాట మార్చారు. తన మందు అన్ని రకాల వైరస్‌లకు పనిచేస్తుందని, ఒమిక్రాన్ ను నయం చేస్తుందని తాను చెప్పలేదన్నారు. అయితే తన మందుతో చాలా మంది కరోనా పేషెంట్లకు నయమైందని చెబుతున్నారు ఆనందయ్య.

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లేదని.. ఒకవేళ పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మురళి, టీవీ9 రిపోర్టర్, నెల్లూరు

ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..