Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేయనున్నారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో దీక్ష కొనసాగనుంది. ఈ నాలుగు నెలలపాటు ఒక్కపూట మాత్రమే భోజనం చేయనున్నారు పవన్ కల్యాణ్. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. రాత్రికి శాకాహారం భోజనంతో ఆరోజుకు దీక్షను ముగిస్తారు. ఇలా ప్రతిరోజూ, నాలుగు నెలలపాటు దీక్ష చేయనున్నారు పవన్ కల్యాణ్. ఆహార నియమాలను అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడనుంది. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్, తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, దర్శనం తర్వాత వేదాశీర్వచనం అందించారు.
ఇక మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన జనవాణికి ప్రజలు పోటెత్తారు. వినతిపత్రాలు పట్టుకుని వందలాది మంది తరలిరావడంతో జనసేన కార్యాలయం కిక్కిరిపోయింది. అందరి సమస్యలను విని, వినతిపత్రాలు తీసుకున్న పవన్, ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీలో గ్రామస్వరాజ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ మాఫియాలా తయారైందంటూ సంచలన కామెంట్స్ చేశారు జనసేనాని. వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తోందని, ఎలా బాధ్యతగా వ్యవహరించాలో తాము నేర్పిస్తామన్నారు. అడ్డగోలుగా ఇసుకను దోచేస్తున్నారన్న పవన్, వైసీపీని గద్దె దించేది మాత్రం జనసేనే అన్నారు. సింహాసాన్ని ఖాళీ చెయ్-ప్రజలు వస్తున్నారంటూ వైసీపీని హెచ్చరించారు జనసేనాని.