
చిలకలూరిపేటలో శ్రీ చరణ్ అనే పొగాకు వ్యాపారి ఉన్నాడు.. ఆ వ్యాపారికి ఒక రోజు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను ఐటి అధికారికిగా చెప్పుకున్నాడు. మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటూ ప్రశ్నించాడు. అన్ని సక్రమంగానే ఉన్నాయని వ్యాపారి చెప్పాడు. అయితే ఫైల్స్ అన్ని చెక్ చేస్తాం.. ఏమాత్రం తేడా వచ్చినా చర్యలు తీసుకుంటాం అంటూ బెదిరించాడు. అంతేకాదు రేపే మీ కంపెనీలో సోదాలు చేయడానికి వస్తున్నాం అని చెప్పుకున్నాడు. దీంతో వ్యాపారిలో కంగారు మొదలైంది. అయితే కొద్దీ సేపటి తర్వాత మరలా సదరు వ్యక్తే ఫోన్ చేసి తనిఖీలకు రాకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని సూచించాడు. భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ బేరాలాడాడు.
అయితే ఈ విషయం శ్రీ చరణ్ ఒక్కడితోనే ఆగిపోలేదు. చిలకలూరిపేటలోని పలువురు వ్యాపారులకు ఫోన్ చేసి అదే విధంగా బెదిరించాడు. అయితే శ్రీచరణ్ తో పాటు మరికొంతమంది తమకు వచ్చిన కాల్స్ పై ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీచరణ్ చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పట్టణ పోలీసులు రంగంలోకి దిగి శ్రీచరణ్ కు ఫోన్ చేసి నంబర్ ట్రాకింగ్ పెట్టారు.
రెండు రోజుల తర్వాత గుంటూరు ఆర్టిసి కాలనీకి చెందిన చదలవాడ తిరుమల రెడ్డి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అతను విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల రెడ్డి గత కొంతకాలంగా ఐటి అధికారిని అని చెప్పుకుంటూ వ్యాపారులను బెదిరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
2017 నుండి ఇదే విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 8 పిఎస్ లలో ఎనిమిది కేసులున్నట్లు తేల్చారు. వ్యాపారుల వివరాలను ఆన్ లైన్ సేకరిస్తున్నట్లు పట్టణ సిఐ రమేష్ తెలిపారు. ఐటి అధికారులమని ఫోన్ చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తరహా మోసాలు చేయడానికి తిరుమల రెడ్డి అలవాటు పడినట్లు సిఐ చెప్పారు. గతంలో మోసం చేసిన కొన్ని కేసుల్లో అరెస్టై జెయిలు కు కూడా వెళ్లివచ్చినట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.