Andhra Pradesh: వివేక హత్య కేసు కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా.? త్వరలోనే కీలక అరెస్టులు.?

వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిందెవరు? అసలు సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? అసలెందుకు వివేకా మర్డర్‌ జరిగింది? అంతబలమైన కారణమేంటి? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. నాలుగేళ్లుగా సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నా...

Andhra Pradesh: వివేక హత్య కేసు కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా.? త్వరలోనే కీలక అరెస్టులు.?
Viveka Murder Case

Updated on: Mar 12, 2023 | 5:53 PM

వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిందెవరు? అసలు సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? అసలెందుకు వివేకా మర్డర్‌ జరిగింది? అంతబలమైన కారణమేంటి? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. నాలుగేళ్లుగా సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నా, ఇదీ అసలు జరిగింది అంటూ తేల్చిచెప్పలేకపోయింది సీబీఐ. అయితే, వివేకా మర్డర్‌కు ఇదే కారణం కావొచ్చంటూ ఫ్యామిలీ సీక్రెట్‌ను బయటపెట్టారు అవినాష్‌రెడ్డి. వివేకా రెండో పెళ్లి, కుటుంబ పరువు, వారసత్వం, ఆస్తుల గొడవ, సునీత-షమీమ్‌ మధ్య విభేదాలు… ఇవన్నీ హత్యకు కారణం అయ్యిండొచ్చని ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని రివీల్‌ చేశారు.

ఒక్క మాటలో చెప్పాలంటే వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు అవినాష్‌రెడ్డి. వారసత్వం, ఆస్తుల గొడవతో వాళ్లిద్దరే వివేకాను మర్డర్‌ చేయించారనేది ఆయన అభియోగం. అంతేకాదు, వివేకా రెండో భార్య షమీమ్‌ను సునీత అనేకసార్లు బెదిరించిందని చెప్పుకొచ్చారు. వివేకా మర్డర్‌ తర్వాత ఆయన రెండో భార్య, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. పోలీసులు కూడా షమీమ్‌ను ప్రశ్నించారు. కానీ ఆమె ఎప్పుడూ మీడియా ముందుకి రాలేదు. అయితే, ఊహించనివిధంగా వైఎస్‌ వివేకా రెండో పెళ్లికి తెరపైకి తెచ్చారు అవినాష్‌రెడ్డి. అలాగే అనేక ప్రశ్నలను సీబీఐ ముందుపెట్టారు. ఎందుకు సీబీఐ వీటిపై దృష్టిపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్‌ వివేకాకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రహస్యాలను బయటపెట్టారు అవినాష్‌రెడ్డి. 2006 నుంచీ వివేకాకు ముస్లిం యువతితో సంబంధముంది. 2011లో ఇస్లాం చట్టం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తన పేరును షేక్‌ మహ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నాడని చెప్పారు. వివేకాకు ముస్లిం యువతికి ఓ కొడుకు పుట్టాడని, ఆ పిల్లాడి పేరు షేక్‌ షెహెన్‌షా అన్నారు. కుటుంబ పరువు కోసం ఈ నిజాలను ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్నానని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టానన్నారు అవినాష్‌రెడ్డి.

తన వారసుడిగా రెండో భార్య కొడుకు షేక్‌ షెహెన్‌షాను ప్రకటించేందుకు వివేకా రెడీ కావడం, ఆస్తులను బదలాయించేందుకు వీలునామా సిద్ధంచేయడంతోనే మర్డర్‌ జరిగిందనేది అవినాష్‌రెడ్డి ఆరోపణ. ఇందులో వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిపై అనేక అనుమానాలున్నాయన్నారు అవినాష్‌. 8కోట్ల రూపాయల పంపకాల మీద గొడవలు జరిగినట్టు చెప్పారు. బెంగళూరు ప్రాపర్టీ విషయంలో వివేకా కుటుంబంలో విభేదాలు తలెత్తినట్టు చెప్పారు. ఇవన్నీ నిజం కాకపోతే సీన్‌ ఆఫ్ క్రైమ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న లెటర్‌ను ఇన్నాళ్లూ సునీత భర్త ఎందుకు దాచిపెట్టాడని ప్రశ్నిస్తున్నారు అవినాష్‌.

ఆ లెటర్‌లో ఉన్న వివరాలేవీ బయటపెట్టొద్దని తనను కోరారని… అసలు, వివేకా ఇంటిని తనను పంపిందే సునీత అన్నారు. వివేకా మర్డర్‌లో వాళ్ల హస్తం లేకపోతే క్రైమ్‌ స్పాట్‌లో దొరికిన లెటర్‌ను సునీత భర్త ఎందుకు దాచిపెట్టాడో చెప్పాలంటున్నారు అవినాష్‌. కడప ఎంపీ సీటు కోసమే వివేకాను చంపేశారనేది సీబీఐ అభియోగం. కానీ, వివేకా ది మర్డర్ ఫర్ గెయిన్ కేసు అంటున్నారు అవినాష్‌రెడ్డి. ఏదో లబ్ధి పొందాలనే లక్ష్యంతోనే వివేకా మర్డర్‌ జరిగిందంటున్నారు. మరి, వివేకా మర్డర్‌ వల్ల అసలు ఎవరికి లాభం. అవినాష్‌రెడ్డి, సునీతల్లో ఎవరి మాట నిజం.! అనేది విచారణ పూర్తైతే కానీ తెలియదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..