విజయనగరం జిల్లాలో 2021 డిసెంబర్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో తమ అభ్యర్థిగా ఇందుకూరి రఘురాజును బరిలోకి దించింది. అయితే అప్పటి ప్రతిపక్ష టీడీపీకి కావాల్సిన ఓట్లు లేకపోవడంతో ఎన్నిక నుండి తప్పుకుంది. దీంతో వైసీపీ అభ్యర్థి ఇందుకూరి రఘురాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కొన్నాళ్ళు బాగానే ఉన్న రఘురాజుకి, అప్పటి ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2024 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుకు వైసీపీ నుండి టిక్కెట్ ఇవ్వొద్దని రఘురాజు వ్యతిరేకించాడు. అయితే రఘురాజు అభిప్రాయాన్ని పట్టించుకోని వైసీపీ అధిష్టానం కడుబండికి టిక్కెట్ కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన రఘురాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి టీడీపీలో జాయిన్ అయ్యి పార్టీలో యాక్టివ్ అయ్యారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, రఘురాజు పై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషన్ రాజు కు మండలి విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు.
విప్ ఫిర్యాదుతో మండలి చైర్మన్ మోషన్ రాజు రఘురాజు పై జూన్ 2న అనర్హత వేటు వేశారు. దీంతో తనపై వేసిన అనర్హత వేటు చెల్లదని, తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు రఘురాజు.. అలా అప్పటి నుండి హైకోర్టులో రఘురాజు కేసు కోర్టులో నడుస్తుంది. అయితే ఆరు నెలల లోపు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి తప్పని పరిస్థితి. దీంతో ఆరు నెలలు దగ్గర పడుతుండంతో ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. అలా ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజులకే ఈ నెల 6న హైకోర్టు తుది విచారణ జరిపి రఘురాజుపై వేసిన అనర్హత వేటు చెల్లదని రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది. అయితే హైకోర్టు తీర్పు రఘురాజుకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆర్డర్ కాపీ రావటం మాత్రం కొంత ఆలస్యం అయింది. దీంతో ఎన్నికల సంఘానికి శాసనమండలి నుండి కానీ, హైకోర్టు నుండి కానీ ఎలాంటి ఆర్డర్ కాపీ రాకపోవడంతో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి.
అయితే తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది, నేనే ఎమ్మెల్సీని కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఇందుకూరి రఘురాజు లేఖ కూడా రాశారు. అయితే తీర్పు కాపీ రాకపోవడంతో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న నామినేషన్లు ఆఖరి తేదీ కావడంతో పదవ తేదీ వరకు వైసీపీ నుండి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయ్యింది. 11వ తేదీన రెండో నామినేషన్ దాఖలు చేయకపోతే వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఏకగ్రీవంగా గెలిచినట్లుగా వెంటనే ఎన్నికల సంఘం ధృవీకరిస్తుంది. అలా కాకుండా రెండో అభ్యర్థి ఎవరైనా నామినేషన్ వేస్తే ఈ నెల 28 న ఎన్నికలు జరుగుతాయి. అలా ఎన్నికలు జరగడానికి సమయం దొరికితే అప్పటి వరకు న్యాయప్రక్రియ తనకు అనుకూలంగా జరగడానికి రఘురాజుకి కొంత సమయం దొరుకుతుంది. దీంతో ఎలాగైనా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలనే ఉద్దేశ్యంతో నామినేషన్ల ఆఖరి రోజు ఇందుకూరి రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. మరోవైపు రఘురాజు ఆర్డర్ కాపీ కూడా నేడో రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ పై అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్డర్ కాపీ వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ లేనట్లు ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉంది. అలా అసెంబ్లీ సెక్రటరీ పంపిన సమాచారం మేరకు ఎన్నిక ఏ క్షణంలోనైనా నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి.