Andra Pradesh: ఆన్‌లైన్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్వేత ఘటన మరువక ముందే మరో వివాహిత ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు బలైంది.
మంగళగిరి మండలం నవులూరుకు చెందిన శ్వేత సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంది. ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని లక్ష రూపాయలు కట్టింది. కాని తిరిగి ఎటువంటి డబ్బులు రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన శ్వేత హైదరాబాద్ వెల్తున్నానని చెప్పి చిల్లకల్లు వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే మంగళగిరి మండలం చిన కాకాని కి చెందిన వివాహిత ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్స్ కు ఉరి వేసుకొని చనిపోయింది. ప్రత్యూష భర్త రాజశేఖర్ ఏపిఐఐసి లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే ప్రత్యూష ఆన్ లైన్ లోన్ యాప్ లైన ఇండియా బుల్, రూపి ఎక్స్ ఈ యాప్ ల నుండి ఇరవై వేల రూపాయలు రుణం తీసుకుంది. ఇప్పటి వరకూ లక్ష రూపాయలు చెల్లించింది. ఇంకా చెల్లించాలంటూ యాప్ నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. ఫోన్ కాల్స్ చేయడం, వాట్సాప్ మెస్సెజ్ లు పంపి వేధిస్తున్నారు. దీంతో వేధింపులు తాళలేక భర్తకు చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆ రెండు యాప్ లోనై సెక్షన్ 306 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.