Andhra Pradesh: విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. సీఎం ఏమన్నారంటే..?

|

Oct 21, 2022 | 7:08 PM

ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో ఉంచాలని బలంగా కోరుతున్నారు ఉత్తరాంధ్ర కీలక నేత, మంత్రి ధర్మాన. అందుకోసం రాజీనామాకు సైతం సిద్దంమని స్పష్టం చేశారు.

Andhra Pradesh: విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన..  సీఎం ఏమన్నారంటే..?
Andhra Minister Dharmana Prasad Rao
Follow us on

విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధపడ్డారు మంత్రి ధర్మాన. ఈసారి ఏకంగా సీఎం జగన్‌నే కలిసి తన వాదన వినిపించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు త్వరలో విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని నుంచి పని ప్రారంభం అవుతుందని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వివరాలేంటో చదివేద్దాం పదండి.  విశాఖ రాజధాని కోసం, వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో సభలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మంత్రులు, ప్రజా సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటున్న టీడీపీ తన హయాంలో ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రులు సత్యనారాయణ, అమర్‌నాధ్‌. అన్నీ ఉన్న విశాఖకు రాజధాని తీసుకొస్తే తప్పేంటని ప్రశ్నించారు.

విశాఖ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమన్న మంత్రి ధర్మాన.. ఈ విషయాన్ని ఏకంగా సీఎం జగనే చెప్పారు.  తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లిన ధర్మాన ప్రసాదరావు సీఎంకు తన వాదనను వినిపించారు. నాలుగు పేజీల లేఖను అందించారు. రాజీనామాకు ఓకే అంటే వెంటనే చేసి విశాఖ రాజధాని కోసం పోరాటం చేస్తానని చెప్పారు. రాజధాని సాధన కంటే మంత్రి పదవి, హోదాలు గొప్పవి కాదని స్పష్టం చేశారు. అయితే పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని, రాజీనామా లాంటి ఆలోచనలు వద్దని ధర్మానకు సూచించారు సీఎం జగన్‌.

మరోవైపు విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని త్వరలో రాబోతోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టులో చిన్న చిన్న కేసులు ఏవైనా ఉన్నా అవన్నీ సర్దుకుంటాయన్నారు. అమరావతి – అరసవిల్లి పాదయాత్ర ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తున్న కొద్దీ తమ వాదనను మరింత గట్టిగా వినిపిస్తోంది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..