Andhra Pradesh: ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ అవ్వాల్సిందే..

తమ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం కోసం ఆ గ్రామం ప్రజలు తీసుకున్న ఒక కఠిన నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఏకంగా ఐస్‌క్రీం బండ్లపైనే యుద్ధం ప్రకటించారు. చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారన్న ఆందోళనతో, కల్తీ రసాయనాలతో కూడిన ఐస్‌క్రీం విక్రయదారులకు ఊరి పొలిమేరల్లోనే చెక్ పెడుతున్నారు.

Andhra Pradesh: ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ అవ్వాల్సిందే..
Ice Cream Ban In Guduru Village

Updated on: Mar 20, 2026 | 8:56 AM

సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలో లేదా శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తాయి. కానీ పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామ పొలిమేరల్లో మాత్రం ఒక వినూత్నమైన హెచ్చరిక బోర్డు వెలిసింది. ‘‘మా ఊరిలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదు.. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం’’ అన్నదే ఆ బోర్డు సారాంశం. తమ పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా గ్రామంలోకి వస్తున్న స్థానిక తయారీ ఐస్‌క్రీం బండ్ల వల్ల చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.

నిషేధించడానికి కారణాలు..

  • ఈ ఐస్‌క్రీంలలో ఏ రకమైన రసాయనాలు, రంగులు వాడుతున్నారో తెలియకపోవడం.
  • వీటిని తిన్న చిన్నారులకు దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు రావడం.
  • లైసెన్స్ లేని వ్యక్తులు సొంతంగా ఐస్‌క్రీంలు తయారు చేసి బండ్లపై గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకే అమ్ముతుండటంతో పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు.
  • ఈ  నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ పెద్దలు వారం క్రితం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని స్థానికులు తెలిపారు.

సామాజిక మార్పుకు శ్రీకారం..

గూడూరు గ్రామస్థులు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన మద్యం బెల్ట్ దుకాణాన్ని సైతం ఊరి పెద్దలు చొరవ తీసుకుని తీయించివేశారు. ఇప్పుడు ఐస్‌క్రీం బండ్లపై నిషేధం విధించడం ద్వారా గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని వారు నిశ్చయించుకున్నారు. కాగా చిన్న గ్రామమే అయినా, ప్రభుత్వ అధికారులు చేసే తనిఖీల కోసం వేచి చూడకుండా గ్రామస్థులే స్వయంగా ఫుడ్ సేఫ్టీ విషయంలో జాగ్రత్త పడటం అభినందనీయం. కల్తీ ఆహారం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇతర గ్రామాలు కూడా ఇలాంటి చొరవ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Ice Cream Ban In Guduru Village 1

Loading...
Unable to load recommendations.
Follow Us