సముద్రం ఎన్నో జలచరాలకు ఆవాసం. చిన్న చేపలు నుంచి పెద్ద తిమింగలాల వరకు అంతులేని సంఖ్యతో సముద్రాన్ని తమ ఆవాసం చేసుకుని జీవిస్తూ ఉంటాయి. రోజు రోజుకూ ఈ సముద్రాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నదీ ప్రవాహాలతో పాటు కొట్టుకొచ్చే ప్లాస్టిక్ వ్యర్ధాలు, రసాయనాలు సముద్ర జీవులకు శాపంగా మారుతున్నాయి. కొన్ని జీవులు ఇప్పటికే అంతరించిపోగా.. మరికొన్ని ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇపుడు కాస్తో కూస్తో మిగిలిన అరుదైన జీవులను సైతం కాపాడుకోకపోతే రాబోయే తరాలకు అలాంటి జీవులు కేవలం పుస్తకాలకే పరిమితమవుతాయి. ఇప్పుడెందుకు అటువంటి అలాంటి అరుదైన జాతుల సముద్ర జీవుల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే.. ఒక అరుదైన జీవి సముద్రం ఒడ్డున పలువురు మత్స్యకారులకు కనిపించింది. అది అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతి జీవిగా గుర్తించారు స్ధానికులు. దీంతో ఇపుడు ఆ జీవిని సంరక్షించుకోవాల్సిన అంశం తెరపైకి వచ్చింది. అసలు ఏంటి ఆ జీవి.? దాని పేరు ఏంటి.? సముద్రంలో ఎక్కడ ఎప్పుడు కనిపించింది.! ఆ వివరాలు తెలుసుకుందాం..
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పీఎంలంక సముద్ర తీరానికి సొర చేపను పోలి ఉన్న చేప కొట్టుకు వచ్చింది. అది ఇంచుమించుగా నాలుగు అడుగుల పొడవు కలిగి.. చూడడానికి సొర చేపలానే ఉంది. దాంతో దానిని సొరచేప అని అక్కడున్న మత్స్యకారులు అనుకున్నారు. గత రెండు రోజులుగా సముద్రం పోటు ఎక్కువగా ఉండటంతో అలల ఉధృతి పెరిగింది. దీంతో భారీగా చేపలు అలల ఉధృతికి ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి. ఆ క్రమంలోనే సొరచేపను పోలిన చేప సైతం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. కాసేపటి తర్వాత మత్స్యకారులు ఆ చేపను తిరిగే మళ్ళీ సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలివేశారు. అయితే అది సొర చేప కాదని తిమింగలం జాతికి చెందిన క్షీరదమని ఫిషరీస్‌కు చెందిన ఏమిరిటస్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆ జాతి అంతరించిపోయే జాబితాలో ఉందని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. అలాంటి అరుదైన జాతులకు చెందిన సముద్ర జీవులను అంతరించిపోకుండా కాపాడుకుని వాటిని సంరక్షించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.