AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ నాటిన ఒక్క మొక్క దేశ చరిత్రనే మార్చింది.. నేటికి 39 ఏళ్లు..

ఒకప్పుడు భారత్ప పామాయిల్‌ను దిగుమతి చేసుకునేది. కానీ వంటనూనెల కొరతను తీర్చేందుకు అనాటి సీఎం నందమూరి తారకరామారావు పాయియిల్ సాగును ప్రోత్సహించారు. దీంతో ఇది దేశ చరిత్రనే మార్చింది. నేడు పామాయిల్ సాగులో ఏపీ అగ్రస్థానంలో ఉండటానికి అదే కారణంగా చెప్పవచ్చు..

ఎన్టీఆర్ నాటిన ఒక్క మొక్క దేశ చరిత్రనే మార్చింది.. నేటికి 39 ఏళ్లు..
Ntr
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 1:32 PM

Share

భారతదేశ వ్యవసాయ ముఖచిత్రంలో వంటనూనెల కొరతను అధిగమించి, సరికొత్త ఆర్ధిక విప్లవానికి నాంది పలికిన ఘనత తెలుగు నేలకే దక్కుతుంది. దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి పామాయిల్‌లో సింహభాగం అంటే దాదాపు 80 నుంచి 90 శాతం మేర ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు ఈ రంగానికి గుండెకాయలా మారాయి. అయితే, నేడు వేలాది ఎకరాల్లో కళకళలాడుతున్న ఈ ‘పసిడి పంట’ వెనుక నాలుగు దశాబ్దాల నాటి అరుదైన చరిత్ర, ఒక ముఖ్యమంత్రి చూపిన దీర్ఘకాలిక దార్శనికత, ఒక రైతు కుటుంబం చూపిన అపారమైన ధైర్యం దాగి ఉన్నాయి. 1980వ దశకంలో దేశం తీవ్రమైన వంటనూనెల కొరతను ఎదుర్కొంటూ, భారీగా విదేశీ దిగుమతులపై ఆధారపడేది. దేశాన్ని ఆయిల్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా నడిపించాలనే దృక్పథంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు సరికొత్త అడుగు వేశారు. 1987 సెప్టెంబర్ 17న ఆయన స్వయంగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం సీతాపురం గ్రామానికి చేరుకుని, దేశంలోనే మొట్టమొదటి పామాయిల్ మొక్కను నాటారు. ఆ రోజు ఆయన వేసిన తొలి అడుగే నేడు లక్షలాది హెక్టార్ల హరిత సౌభాగ్యానికి పునాదిరాయిగా నిలిచింది.

సంశయాలను పటాపంచలు చేసిన ఉండవల్లి దంపతులు

మెట్ట ప్రాంతమైన సీతాపురంలో ఆ రోజుల్లో మొక్కజొన్న, పొగాకు వంటి పంటలతో పాటు కొబ్బరి మాత్రమే ప్రధానంగా కనిపించేది. పూర్తిగా అపరిచితమైన, లాభనష్టాలు తెలియని పామాయిల్‌ను సాగు చేసేందుకు మెజారిటీ రైతులు వెనుకంజ వేశారు. ఆ తరుణంలో గ్రామానికి చెందిన రైతు ఉండవల్లి ఇంద్రరావు, ఆయన భార్య నాగరత్నమ్మ దంపతులు తెగువ చూపారు. స్వయంగా ముఖ్యమంత్రి తమ పొలానికి వచ్చి ఇచ్చిన భరోసాతో, తమకున్న ఒక ఎకరం పొలంలో 60 మొక్కలతో ప్రయోగాత్మక సాగును మొదలుపెట్టారు. ఆనాడు పదో తరగతి చదువుతున్న వారి కుమారుడు రాము కూడా నాటి ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఈ మహత్తర ఘట్టంలో భాగస్వామి అయ్యారు. సాగు మొదలైన మూడేళ్లకు గెలలు కాపుకొచ్చినా, ఆ రోజుల్లో స్థానికంగా ఎలాంటి ప్రాసెసింగ్ మిల్లులు లేకపోవడం, మార్కెటింగ్ సౌలభ్యం కొరవడటంతో దాదాపు ఏడాదిపాటు ఆ కుటుంబం నష్టాలను భరించాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గకుండా ఉద్యానవన శాఖ, డీఆర్‌డీఏ అధికారుల మార్గదర్శకత్వంతో తోటను సంరక్షించారు. దీంతో ఇంద్రరావు పొలమే యావత్ భారతదేశానికి మొదటి ‘డెమో ప్లాంట్’గా మారి, సాగుపై అధ్యయనం చేయడానికి వచ్చే రైతులకు ఒక సజీవ ప్రయోగశాలగా నిలిచింది.

39 అడుగుల ఎత్తు.. నాలుగు దశాబ్దాల నిరంతర దిగుబడి

అనంతర కాలంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు ఎదురైనా, ఆనాడు నాటిన 60 చెట్లలో 50కి పైగా చెట్లు నేటికీ దృఢంగా నిలిచి ఉన్నాయి. నాటి సీఎం స్వహస్తాలతో నాటిన తొలి మొక్క ప్రస్తుతం 39 అడుగుల ఎత్తుకు ఎదిగి, 39 ఏళ్లుగా నిర్విరామంగా కాపునిస్తూ నాణ్యమైన గెలలను అందిస్తోంది. నాటి ఒక ఎకరం ప్రయోగం నేడు రాము సారథ్యంలో వంద ఎకరాల విస్తీర్ణానికి చేరుకుంది. సాధారణంగా పదేళ్ల తోట అందించే నాణ్యమైన దిగుబడిని ఈ 40 ఏళ్ల నాటి వృక్షాలు నేటికీ ఇస్తుండటం విశేషం.

పరిశోధనల కేంద్రంగా పెదవేగి: దేశానికి మార్గదర్శి

సీతాపురంలో మొదలైన ఈ చారిత్రక విజయం ఫలితంగానే పరిసర ప్రాంతాల్లో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో తొలి ప్రాసెసింగ్ కర్మాగారం ప్రారంభమైంది. అంతేకాకుండా, మేలైన హైబ్రిడ్ వంగడాలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం పెదవేగిలోనే జాతీయ ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రాన్ని (ICAR-IIOPR) నెలకొల్పింది. గోదావరి జిల్లాల నుంచి మొదలై కృష్ణా, రాయలసీమ మీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్లకు విస్తరించిన ఈ పంట నేడు అసంఖ్యాక రైతు కుటుంబాలకు సుస్థిరమైన ఆర్ధిక దన్నుగా నిలుస్తోంది. సీతాపురం మట్టిలో మొలకెత్తిన ఆ ఒక్క మొక్క, భారతదేశ వంటనూనెల రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని అగ్రపథాన నిలిపింది.

Follow Us