తెల్లారేసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెల్లారేసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!
Horrific Incident In East Godavari

Edited By:

Updated on: Aug 11, 2026 | 1:56 PM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాతతుంగపాడుకు చెందిన కమిడి లక్ష్మణరావు (35)కు పోలియో కారణంగా రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన స్థానికంగా ఔషధాలు, ఫ్యాన్సీ వస్తువులకు సంబంధించిన చిన్న దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన శ్యామల (31)ను ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. శ్యామల మానసిక దివ్యాంగురాలిగా పోలీసులు తెలిపారు. దంపతులిద్దరికీ కలిపి ప్రభుత్వం నుంచి సుమారు రూ.12 వేల పింఛను వస్తున్నట్లు సమాచారం.

తల్లి మరణంతో మానసికంగా కుంగిపోయిన భర్త

కొన్ని నెలల క్రితం లక్ష్మణరావు తల్లి మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 08) అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య శ్యామలను హత్య చేసిన లక్ష్మణరావు, అనంతరం తాను కూడా ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆదివారం ఉదయం 9 గంటలు దాటినా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు ఇంటి తలుపులు తోసి లోపలికి వెళ్లగా దంపతులు ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సెల్ఫీ వీడియోలో కీలక వివరాలు

సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం ఉత్తర మండల డీఎస్పీ సీహెచ్. జీవన, సీఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో సెల్ఫీ వీడియో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో తన తల్లి పదేపదే గుర్తుకొస్తోందని, తాను కూడా ఆమె వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణరావు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను లేకపోతే తన భార్యను చూసుకునేవారు ఎవరూ ఉండరనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిపారు.

అలాగే ఆరు నెలల క్రితం భూమి విక్రయం ద్వారా వచ్చిన డబ్బుల్లో రూ.25 లక్షలను తన అన్న తీసుకోవాలని కూడా వీడియోలో పేర్కొన్నట్లు సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు వీడియోలో చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ

శ్యామల చేతి మణికట్టు వద్ద గాయం కావడంతో అధిక రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లక్ష్మణరావు మంచంపై కూర్చున్న స్థితిలో ఉరి వేసుకున్నట్లు ఘటనాస్థలిలో ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. మృతుడి సోదరుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫీ వీడియో, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను నిర్ధారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. దంపతులిద్దరి మృతితో పాతతుంగపాడులో తీవ్ర విషాదం నెలకొంది. ఏడాది క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులు ఇలా మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us