AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు

| Edited By: Team Veegam

Apr 19, 2021 | 10:06 PM

AP Government: ఏపీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులను...

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు
Minister Adimulapu Suresh
Follow us on

AP Government: ఏపీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులను ప్రకటించింది. ఈ సెలవులను మంగళవారం నుంచి ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని, ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

కాగా, ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, హోంశాఖ, విద్యాశాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిపై తీసుకునే చర్యలపై సమీక్షించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, పదో తరగతి, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తాజాగా ప్రకటించింది.

కాగా, ఏపీ రాష్ట్రంలో కరోనా విపగవిప్పుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తీవ్రతరం అవుతున్నాయి. ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వయంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా పంజా విసురుతుంది. ఇక ఏపీలో నిన్న 35,922 పరీక్షలు నిర్వహించగా… 6,582 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న కోవిడ్ వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది

కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..