Heli Ride in Vijayawada: దసరా వేడుకల్లో భక్తులకు బెజవాడ అందాల విహంగ వీక్షణ అవకాశం.. హెలీరైడ్ ప్రారంభం!

|

Oct 10, 2021 | 12:50 PM

కృష్ణా జిల్లా యంత్రాంగం దసరా వేడుకలను జరుపుకునే సమయంలో భక్తులు హెలికాప్టర్‌లో బెజవాడ అందాలను ఆస్వాదించడానికి అవకాశం కల్పించింది.

Heli Ride in Vijayawada: దసరా వేడుకల్లో భక్తులకు బెజవాడ అందాల విహంగ వీక్షణ అవకాశం.. హెలీరైడ్ ప్రారంభం!
Heli Ride Invijayawada
Follow us on

Heli Ride in Vijayawada: కృష్ణా జిల్లా యంత్రాంగం దసరా వేడుకలను జరుపుకునే సమయంలో భక్తులు హెలికాప్టర్‌లో బెజవాడ అందాలను ఆస్వాదించడానికి అవకాశం కల్పించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం ఇందిరాగాంధీ నగర్ స్టేడియంలో విమాన సర్వీసును ప్రారంభించారు. ముందుగా ఆలయ ఇవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర సౌందర్యాన్ని వీక్షించారు. ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ జే.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్‌ కూడా హెలీకాఫ్టర్‌లో విహరించారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ మరియు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం సంయుక్తంగా నిర్వహించారు.

దసరా మహోత్సవాలు జరుగుతున్న రోజుల్లో అంటే ఈనెల 17 వరకు ఈ హెలీ రైడ్ భక్తులకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆరు నిమిషాల పాటు సాగే ఈ విహంగ వీక్షణ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్‌ రైజ్‌ ఎయిర్‌ చార్టర్‌ సంస్థ, తుంబై ఏవియేషన్‌ ప్రైవేట్‌ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్‌ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి.

 

ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు..

ఇక ఇంద్రకీలాద్రిపై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తున్నరు. ప్రతిరోజూ 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇస్తారు. కోవిడ్‌ దృష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. స్లాట్ లేని భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరించిన దేవస్థానం.. పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించింది. ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

దుర్గమ్మ దర్శనానికి నిబంధనలు ఇవీ..

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రీపై దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా నిర్ధారించే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని.. ప్రతీరోజూ ఉచిత దర్శన టికెట్లపై 4 వేల మంది, రూ.300 టికెట్లపై 3 వేలు, రూ. 100 టికెట్‌పై మరో 3 వేల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చునని అన్నారు.

ఇక భవానీలు తమ స్వస్థలాల్లోనే దీక్షను విరమణలు చేసుకోవాలని తెలిపారు. కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తుల కోసం ప్రత్యేకంగా 15 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ వెల్లడించారు. కాగా, మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Social Distance: సోషల్ డిస్టెన్స్ మనుషులకు కరోనా నేర్పింది.. జంతువులు-పక్షులకు ఎప్పుడో తెలుసు!

Air Pollution: మూడేళ్ళు కాలుష్య నగరంలో కాపురం ఉంటె మహిళల్లో ఆ జబ్బు ప్రమాదం భారీగా ఉంటుంది!