Flood flow to Sangameswara Temple: సప్తనదీ సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సంగమతీరం సంద్రాన్ని తలపిస్తోంది. వారం రోజులుగా వరద పోటెత్తడంతో సంగమేశ్వరం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సంగమేశ్వరాలయం జలాధివాసం కావడంతో భక్తులు ఎగువన ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్నారు. అర్చకులు అంత్య పూజలు నిర్వహించారు. వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ.. చివరికి సముద్రంలో కలసిపోతాయి. ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేప లింగాన్ని సందర్శిస్తే.. నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తుల నమ్మకం.
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితాసంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వరాలయం ఈ ఏడాది మార్చి 21వ తేదీ శ్రీశైల జలాశయం, కృష్ణా జలాల్లో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జులై 21వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించి.. వేపదారు శివలింగాన్ని తాకాయి. 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చాడు. మళ్ళీ స్వామి వారి దర్శనం కలగాలంటే 8 నెలలు వేచిచూడాలి భక్తులు.
ఈ సంగమేశ్వరాలయం ఆలయం విశేషం ఏమిటంటే.. గత సంవత్సరం జులై21 వ తేదీ గర్భాలయం లోకి నీరు ప్రవేశిస్తే, ఈసంవత్సరం కూడా సరిగ్గా జులై 21 వతేదీ రోజే కృష్ణా జలాలు సంగమేశ్వరున్ని తాకాయి. తొలి ఏకాదశి పుజల అనంతరం స్వామి వారికి ఈ సంవత్సరం చివరి పూజలు జరిపించారు అలయ అర్చకులు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుంటుంది. మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం బీముడు ప్రతిష్టించారు. వేపదారు శివలింగం అయిన ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది.
సంగమ తీరంలో గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. నదిలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో మరబోటు ప్రయాణాన్ని నిషేధించారు. పర్యాటకులు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరు మత్స్యకారులు మరబోటుపై నదిలోకి వెళుతున్నారు.