
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో బంగారు ఆభరణం చోరి జరిగింది. ఈ కేసులో గ్రామానికి చెందిన గోపిక్రిష్ణ, శాంతిరాజు, చీకటి గోపిలను విచారణ నిమిత్తం గత నెల 25వ తేదిన స్టేషన్ కు తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు విచారించిన తర్వాత చీకటి గోపి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించి.. ఈ సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించినట్లు కటుుంబ సభ్యులు తెలిపారు. గత నెల 27వ తేదిన చీకటి గోపిని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి మరింత విషయమించడంతో గోపి జిజిహెచ్ కు తీసుకొచ్చారు. అక్కడ నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన గోపి నిన్న చనిపోయాడు. దీంతో చీకటి గోపి భార్య, అతని బంధువులు జిజిహెచ్ లో ఆందోళనకు దిగారు.
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే గోపి అనారోగ్యం పాలైన చనిపోయాడని అతని భార్య జ్యోతి ఆరోపించింది. బంగారు ఆభరణం దొంగతనం కేసులో తన భర్తను తీసుకెళ్లిన పోలీసులు రెండు రోజుల పాటు స్టేషన్ లోనే ఉంచి లాఠీలతో కొట్టినట్లు ఆమె మ్రుతదేహంపై ఆనవాళ్లను చూపించారు. తన భర్తకు ఆ దొంగతనంతో సంబంధం లేదని అయినా విచారణ పేరుతో తీసుకెళ్లి హింసించినట్లు ఆమె చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేయకుండా రెండు రోజుల పాటు ఎలా అదుపులో ఉంచుకుంటారంటూ ప్రశ్నించారు.
అయితే తాడికొండ పోలీసులు మాత్రం తాము చీకటి గోపి కొట్టలేదని చెప్పారు. దొంగతనంలో భాగస్వామ్యం ఉన్న ముగ్గురిని తీసుకెళ్లి విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు తేలిందన్నారు. విచారణలో ఉండగానే చీకటి గోపి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి చీకటి గోపిని పంపించినట్లు తెలిపారు. చీకటి గోపి మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..