డా.బీఆర్.అంబేడ్కర్ ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ పవన్ కల్యాణ్ చిన్నపిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమని, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కాదని చెప్పారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని అన్నారు. అది కూడా తెలియకుండా పవన్ కల్యాణ్ అలా మాట్లాడడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని ఆక్షేపించారు. అయితే.. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అదేదో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు.
అభ్యంతరాలుంటే 30 రోజులు సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పిన ప్రభుత్వం మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సామూహికంగా కాదు, వ్యక్తులుగా రావాలని చెప్పారని అది వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని పవన్ ప్రశ్నించారు.
మరోవైపు.. మంగళవారం కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి