అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి.. పట్టాల మధ్య ఇరుక్కుని నరకయాతన..!

| Edited By: Balaraju Goud

Nov 09, 2024 | 8:25 AM

కదులుతున్న రైలును ఎక్కబోయి దిగబోయి చాలామంది ప్రాణాల పైకి తెచ్చుకుంటే.. మరి కొంతమంది గాయాలపాలై నరకయాతన అనుభవించారు.

అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి.. పట్టాల మధ్య ఇరుక్కుని నరకయాతన..!
Train Accident
Follow us on

అనకాపల్లి: రైల్వే స్టేషన్‌ వద్ద అదృష్టం లేకుండా, కదులుతున్న రైలుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి నరకయాతన అనుభవించాడు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కబోతూ, ప్లాట్‌ఫారమ్‌ రైలు భోగి మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘోరం అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ప్రయాణికుడిని రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య నుంచి బయటకి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. డ్రిల్లర్లతో ప్లాట్‌ఫారమ్‌ కొంత భాగాన్ని ధ్వంసం చేసి, చాలా కష్టపడిన తర్వాత అతన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే అతనికి తీవ్ర గాయాలైన అతన్ని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఆ వ్యక్తి పైలా రాజబాబుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం తోటకూర పాలెంకు చెందిన రాజబాబు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతర హింసాత్మక ఘటనలు:

ఈ ఏడాది ఇదే తరహా మరిన్ని విషాద ఘటనలు వెలుగు చూశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూన్‌ నెలలో జబర్దస్త్ టీవీ ఆర్టిస్టు మేదర మహ్మద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. భద్రాచలం రైల్వే స్టేషన్‌లో కాకతీయ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖ జిల్లాలో మరొక విషాదం

2022 డిసెంబర్‌లో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద శశికళ అనే యువతి రైలు దిగడానికి ప్రయత్నించగా, ఆ రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో, ప్రాణాలు కోల్పోయింది. ఆమెను రక్షించడానికి ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరికి చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మరణించింది.

చీరాల స్టేషన్‌లో మరొక ఘటన

2023 ఏప్రిల్‌లో చీరాల రైల్వే స్టేషన్ వద్ద తిరుపతమ్మ అనే మహిళ కదులుతున్న రైలు ఎక్కబోయి, ప్రమాదవశాత్తు జారి రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య చిక్కుకుంది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.

ప్రయాణికులకు సూచన:

ఇవి కేవలం కొన్ని ఘటనలు మాత్రమే.. ఇంకా అనేక ఘటనలో ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కబోయి దిగబోయి చాలామంది ప్రాణాల పైకి తెచ్చుకుంటే.. మరి కొంతమంది గాయాలపాలై నరకయాతన అనుభవించారు. రైలు పూర్తిగా ఆగాకనే ప్రయాణికులు రైల్లో ఎక్కాలని.. రైలు నుంచి దిగాల్సిన వాళ్లు ఆగిన తర్వాతే సేఫ్ గా దిగాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..