ఆలయంలో దర్శనానికి వెళుతుండగా పొరపాటున బంగారు గొలుసు మాయమైంది. తిరిగి ఎలా వచ్చింది అంటే?.. ఆ మహానందీశ్వరుడు స్వామి వల్లే వచ్చిందంతున్నాడు ఓ భక్తుడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి..
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసు అధికారుల చొరవతో లభ్యం కావడం వల్ల.. బాధితుడు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన భిక్షపతి.. గత శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. స్వామిని దర్శించుకోడానికి గర్బగుడిలోకి వెళ్లే సమయంలో షర్టు తీసి.. పంచ ధరించే సమయంలో మెడలోని మూడు తులాల బంగారం గొలుసు కింద పడిపోయింది. ఈ విషయాన్ని భక్తుడు ఆలస్యంగా తెలుసుకుని ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు.
కంప్లయింట్ అందుకున్న వెంటనే ఈఓ.. ఆలయంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీంచారు. సీసీ కెమెరాలో కొందరికి గొలుసు దొరికింది. వాళ్లు వచ్చిన వాహనం నెంబర్ ద్వారా ఆలయం అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ అధికారులు, పోలీసుల కృషితో పోయిన బంగారు గొలుసు బాధితుడికి అందజేశారు. తాను పోగొట్టుకున్న గొలుసు మూడు రోజుల్లో తిరిగి ఇప్పించడంలో ఆలయ అధికారులు చూపిన చొరవకు భక్తుడు భిక్షపతి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ఆలయానికి వచ్చే భక్తులు తమ విలువైన వస్తువులు, ఆభరణాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..