
గోదావరి రొయ్య, మళ్లీ మీసం మెలేస్తోంది. రొయ్యకు మంచి రోజులొచ్చాయి. ఇన్నాళ్లు అమెరికా టారిఫ్‌లతో కుంగిపోయిన ఆక్వా రంగంలో, తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. అగ్రరాజ్యంతో మోదీ సర్కార్ కుదుర్చుకున్న డీల్‌తో ఆక్వా ఎగుమతులకు మళ్లీ రెక్కలు రానున్నాయి. దీంతో ఏపీలో రొయ్యల సాగు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్నందుకు గత ఏడాది భారత్‌పై 25శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. దీంతో అంతకుముందున్న సుంకాలతో కలుపుకుని భారత్ ఎగుమతులపై మొత్తం 50 శాతం టారిఫ్‌లు వేసినట్లయింది. ఇప్పుడు భారత్‌పై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు తొలగించడంతో పాటు, అంతకుముందున్న 25 శాతం సుంకాలను కూడా తగ్గించారు. దీంతో గోదావరి జిల్లాల్లో రొయ్యల సాగు చేసే రైతులు, ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు మన రొయ్యల ఎగుమతులపై వేస్తున్న సుంకం ఎంత? ఈ టారిఫ్‌లు తగ్గడంతో మన ఆక్వా రంగానికి జరిగే బెనిఫిట్ ఏంటో చూద్దాం.
రొయ్యల ఎగుమతులపై టారిఫ్ 18 శాతానికి దిగిరావడంతో.. మనం కోల్పోయిన మార్కెట్‌ను తిరిగి పొందగలుగుతామని ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్…యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో యూరప్ మార్కెట్‌కు కూడా మన ఆక్వా ఎగుమతులు పెరుగుతాయని, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ చెబుతున్నారు.
భారీ టారిఫ్‌ల దెబ్బతో, గత ఏడాది అమెరికాకు రొయ్యల ఎగుమతులు 20 శాతం దాకా తగ్గిపోయాయి. గత ఐదారు నెలలుగా ఆక్వా ఇండస్ట్రీ పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో ఏపీలో రొయ్యల సాగు తగ్గించి, చేపల సాగు మొదలుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ లేటెస్ట్ స్టేట్‌మెంట్‌తో ఆక్వా రంగం ఊపిరి పీల్చుకుంటోంది. సుంకాలు తగ్గడంతో, అమెరికా మార్కెట్‌లో ఇతర దేశాలతో పోటీ పడగలుగుతామని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ చెబుతున్నారు.
ఏపీలో ఏటా… చేపలు, రొయ్యల ఉత్పత్తి 51.58 లక్షల టన్నుల వరకు ఉంది. వాటిలో సముద్ర రొయ్యల ఉత్పత్తి 18 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఏపీది అగ్రస్థానం. ఏపీ నుంచి అమెరికాకు 60 నుంచి 65 శాతం వరకు ఎగుమతి అవుతుండగా… మిగిలినది జపాన్ గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. రొయ్యల ఎగుమతుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలదే సింహ భాగం. ఇక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో, యూరప్ మార్కెట్‌లో మన ఆక్వా ఉత్పత్తులపై అస్సలు సుంకాలే ఉండవు. దీంతో యూరప్ మార్కెట్‌లో గోదావరి రొయ్యలకు గిరాకీ పెరగనుంది. ఏప్రిల్ నుంచి ఏపీలో ఆక్వా సీజన్ మొదలవుతుంది. అప్పటికింకా పరిస్థితులు మరింత సానుకూలంగా మారతాయన్న ఆశాభావంతో ఉన్నారు రైతులు, ఎగుమతి దారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..