
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో నివాసం ఉంటున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తొమ్మిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి, కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి ఆచూకీ కోసం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి. దాదాపు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని నాలుగు ప్రత్యేక బృందాలుగా విభజించి, తుని మండలం దొండవాక పంచాయతీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో, ముఖ్యంగా చిన్నారి అదృశ్యమైన పామాయిల్ తోట, దాని పక్కనే ఉన్న కొండ ప్రాంతాలలో జల్లెడ పడుతున్నారు. వీటితో పాటు, 150 మందికి పైగా పోలీసులు పది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ బృందం కూడా జ్ఞానేశ్వరి కోసం నిరంతరం గాలిస్తోంది.
స్థానిక ప్రజల సహాయ సహకారాలతో పాటు, చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ చేస్తూ, సమాచారం రాబట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారంలోగా చిన్నారి ఆచూకీ కనుగొనేలా గాలింపు ముమ్మరంగా సాగుతోంది. హోం మంత్రి అనిత ఈ కేసు దర్యాప్తు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆమె కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడి, దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని అతి త్వరగా కనుగొనడానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన మలుపు తిరిగింది. చిన్నారి అదృశ్యమైనప్పుడు ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్క అనూహ్యంగా మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీసింది. అదృశ్యమైన రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, పోలీసులు, అధికారులను చూసి భయపడి వెళ్లిపోయింది. మరుసటి రోజు తిరిగి వచ్చిన తర్వాత, కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ బిగించి, అది తిరిగిన ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేశారు. దాదాపు 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కుక్క అస్వస్థతకు గురై మరణించింది. పెంపుడు కుక్క మృతిపై ఉన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. తుని మండలం ఎన్. సురవరం పశువైద్యశాలలో పశువైద్యులు కుక్క శవపరీక్షను నిర్వహించి, శరీర భాగాల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను మరింత విశ్లేషణ కోసం విశాఖపట్నంలోని ల్యాబ్‌కు తరలించారు. ఈ పోస్టుమార్టం నివేదికతో పాటు ల్యాబ్ ఫలితాలు దర్యాప్తులో కొత్త సమాచారం వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, జాహ్నవి అదృశ్యంపై పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు చిన్నారి కొండచిలువ బారిన పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లోనే చిన్నారి దుస్తులు సహా ఆనవాలు కనిపించకుండా పోతాయంటున్నారు. అటవీ శాఖ అధికారి పట్టాభి మాత్రం ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, ఇతర వన్య ప్రాణులు చేసిన ఘటనలు నమోదైన దాఖలాలు లేవని చెబుతున్నారు.దీంతో జాహ్నవి అదృశ్యంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..