Andhra Pradesh: గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

గణేష్ నిమజ్జన వేడుకల్లో డీజే వాహనాల అనుమతుల వివాదానికి తెరపడింది. ఉత్సవ కమిటీలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాలను సీజ్ చేయవద్దంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన విజ్ఞప్తిపై ఏపీ హోంమంత్రి అనిత తక్షణమే స్పందించారు. నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతులు ఇవ్వాలంటూ పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులకు ఊరట లభించింది.

Andhra Pradesh: గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Ganesh Nimajjanam Dj Permissions

Updated on: Sep 18, 2026 | 9:48 AM

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వాహనాల అనుమతుల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా డీజే అనుమతులు మంజూరు చేయాలని, వాహనాలను సీజ్ చేయవద్దని మంత్రి నారా లోకేశ్ కోరగా.. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన శోభాయాత్రల్లో డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారని, వాహనాలను సీజ్ చేస్తున్నారంటూ పలువురు నిర్వాహకుల నుంచి తనకు ఫిర్యాదులు, సందేశాలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. భక్తుల మనోభావాలు, ఉత్సవాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల పేరుతో ఎక్కడా ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకుండా, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన కోరారు.

నారా లోకేశ్ విజ్ఞప్తిపై హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందిస్తూ రిప్లై ఇచ్చారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డీజే అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని పోలీస్ శాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో హిందూ ధర్మ ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక శోభకు భంగం కలగకుండా సంప్రదాయబద్ధంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.

ఉత్సవ కమిటీలు కూడా శబ్ద కాలుష్య నిబంధనలు, పోలీసుల మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హోంమంత్రి సానుకూల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల నిర్వాహకులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us